నిధుల దుర్వినియోగం ఆరోపణపై విచారణ
పెదబయలు: మండలంలోని లక్ష్మీపేట గ్రామ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం జరిగాయని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు అర్జీ అందజేయడంతో శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపినట్టు స్థానిక మండల పంచాయతీ విస్తరణాధికారి(ఈవోపీఆర్డీ) నర్సింగరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో సందర్శించారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆరా తీశారు. పనులు సక్రమంగా నిర్వహించకుండా 15 ఆర్థిక సంఘం నిధులు డ్రా చేశారని, ఎలాంటి వీఎల్‌సీదారులు లేకుండా నేరుగా సర్పంచ్ పేరుతో డ్రా చేశారని ఫిర్యాదుదారుడు బొండా సన్నిబాబు విచారణాధికారి దృష్టికి తీసుకొచ్చారు. ఎంత వరకు పనులు చేశారో తేల్చేందుకు ఇంజినీరింగ్ అధికారులతో కూడిన నిఫుణుల కమిటీ వేయాలని కోరారు. పనులు గతంలో కంటే బాగానే జరిగాయని కొంతమంది, తీర్మానాలు చేయకుండా నిధులు ఖర్చు చేస్తున్నారని మరికొంతమంది విచారణాధికారికి తెలియజేశారు. విచారణ వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించి, ఆదేశాలు వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని ఈవోఆర్‌డీ నర్సింగరావు తెలిపారు. విచారణకు గ్రామ పంచాయతీ కార్యదర్శి హాజరు కాలేదు, నిధుల ఖర్చులకు సంబంధించి ఎలాంటి రికార్డులు విచారణ సమయంలో చూపకపోవడం గమనార్హం. సర్పంచ్ లకే అశోక్‌కుమార్, గిరిజన సంఘం నాయకుడు బొండా సన్నిబాబు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


