గిరిజనుల చేతికి చిక్కిన బైక్ దొంగలు
ముంచంగిపుట్టు: మండలంలోని దొడిపుట్టు పంచాయతీ కేంద్రం సమీపంలో నలుగురు బైక్ దొంగలను స్థానిక గిరిజనులు శనివారం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొంత మంది అనుమానా స్పదంగా దొడిపుట్టు గ్రామ సమీపంలో సంచరిస్తూ ఉండడంతో స్థానికులు వారిని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకుండా వారు తప్పించుకొని కొండ ప్రాంతం వైపు పరుగు తీశారు. దీంతో దొడిపుట్టు, దొరగూడ, పనస, సిందిపుట్టు గ్రామాల గిరిజనులు కొండ ప్రాంతాన్ని చుట్టుముట్టి వారిని పట్టుకున్నారు. పట్టుబడిన ఆ నలుగురు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన వారుగా గుర్తించారు. బైకులను దొంగతనాలు చేయడంతో పాటు ఈ ప్రాంతంలో చోరీ చేసిన వాహనాలను విక్రయించేందుకు వచ్చినట్టు తెలుసుకున్నారు. దీంతో ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించి, వారిని పోలీసులకు అప్పగించారు. స్థానిక ఎస్‌ఐ జె.రామకృష్ణ విచారణ జరిపారు. బైకులు దొంగతనం చేసి, వేరే జిల్లాకు వెళ్లి, అక్కడ అమ్ముకాలు చేస్తున్నట్టు విచారణలో తేలింది. ఇటీవల తుని రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్రవాహనం దొంగతనం చేసి, ఏవోబీ సరిహద్దులో విక్రయించేందుకు వచ్చినట్టు నిందితులు తెలిపారని ఎస్‌ఐ చెప్పారు. తుని రూరల్ పోలీసు స్టేషన్‌లో ద్విచక్రవాహనం దొంగతనంపై కేసు నమోదు కావడంతో నిందితులను అక్కడికి పంపుతామని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
పోలీసు స్టేషన్‌లో అప్పగింత


