పోలీసుల వేధింపులు ఆపాలి
● ఐటీడీఏ ఎదుట గిరిజనుల నిరసన
రంపచోడవరం: మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో పోలీసులు అమాయక ఆదివాసీలను తీవ్రంగా వేధిస్తున్నారని, వేధింపులను ఆపాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గిరిజనులు సోమవారం ప్రదర్శన నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, పీవో కట్టా సింహాచలానికి వినతిపత్రాన్ని అందజేశారు. సీపీఐ (ఎంఎల్) నాయకుడు పల్లాల లచ్చిరెడ్డి మాట్లాడుతూ అటవీ ఉత్పత్తుల సేకరణకు అడవుల్లోకి వెళ్లే ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. తమ అవసరాల కోసం అడవుల్లోకి వెళ్లిన గిరిజనులను పోలీసులు నిర్బంధిస్తున్నారని చెప్పారు. మారేడుమిల్లి మండలం పుల్లంగి, గుడిసె పాములమామిడి, బంద, బొడ్లంక, చట్లవాడ, వై.రామవరం మండలంలోని కానివాడ, చెరువూరు, వేజువాడ, చింతలపూడి, పుట్టగండి, రచ్చవలస, భీమునిగడ్డ, చింతకొయ్య, బులసిపాలెం తదితర అటవీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ చేస్తూ ఆదివాసీలను భయాందోళనలకు గురి చేస్తున్నారని తెలిపారు. పీవో, సబ్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి పోలీసుల వేధింపుల నుంచి గిరిజనులను కాపాడాలని కోరారు.


