అభిప్రాయ సేకరణకు అనుగుణంగా పునరావాసం
చింతూరు: నిర్వాసితుల అభిప్రాయాలకు అనుగుణంగా వారు కోరుకున్న ప్రాంతంలో పునరావాసం కల్పించాలని చింతూరుకు చెందిన పోలవరం నిర్వాసితుల పీడీఎఫ్ కమిటీ ఐటీడీఏ పీవో, ఆర్‌అండ్‌ఆర్ అధికారి అపూర్వ భరత్‌కు విజ్ఞప్తి చేసింది. సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పీడీఎఫ్ కమిటీ సభ్యులు పీవోను కలసి అభిప్రాయ సేకరణ వివరాలను అందచేశారు. ఈ సందర్భంగా పీడీఎఫ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ముంపులో భాగంగా చింతూరులో నిర్వాసితులవుతున్న గిరిజనేతర కుటుంబాల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించినట్లు తెలిపారు. 1,411 కుటుంబాల నుంచి అభిప్రాయాలను సేకరించగా 1,015 కుటుంబాలు తూర్పు గోదావరి జిల్లా గోకవరం సమీపంలోని కృష్ణునిపాలెంలో పునరావాసం కల్పించాలని, 384 కుటుంబాలు ఏలూరు జిల్లా తాడువాయిలో పునరావాసం కల్పించాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు. దీనిపై స్పందించిన పీవో అపూర్వభరత్ మాట్లాడుతూ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళతానని, గ్రామసభల నిర్వహణ అనంతరం నిర్వాసితులను ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి పునరావాస ప్రాంతాలను చూపించేలా చర్యలు చేపడతామని తెలిపారు.
ప్రతిఒక్కరికీ పరిహారం అందేలా చర్యలు
డివిజన్‌లో నిర్వాసితులవుతున్న ప్రతిఒక్కరికీ పరిహారం అందేలా చర్యలు చేపడుతున్నట్టు పీవో అపూర్వభరత్ తెలిపారు. ప్రతి గ్రామసభలో అర్హులైన నిర్వాసితుల జాబితా వెల్లడి చేస్తున్నామని, జాబితాలో పేర్లు లేకపోయినా, పెండింగ్‌లో ఉన్నా 15 రోజులు లోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అర్హులైన వారి పేర్లను పరిహారం జాబితాలో చేర్చు తామని పీవో తెలిపారు. ఈ కార్యక్రమలలో పీడీఎఫ్ కమిటీ సభ్యులు బొజ్జా పోతురాజు, పయ్యాల నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి శ్రీనివా సరావు, సయ్యద్ ఆసిఫ్, నామాల శ్రీనివాసరావు, ఎస్కే రంజాన్, చంద్రశేఖర్, అహ్మద్‌అలీ, శ్రీనివాసాచారి, జిక్రియా, చంద్రశేఖర్, జీవన్, అయ్యూబ్‌అలీ, ఈశ్వరాచారి, షాజహాన్ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీవోకు పీడీఎఫ్ కమిటీ విజ్ఞప్తి


