ఘనంగా ఇటుకల పండగ ప్రారంభం
హుకుంపేట: మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఇటుకల పండగ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. గిరిజనులు నిర్వహించే అత్యంత పెద్ద పండగలో ఇటుకల పండగ ఒకటి. ఈ పండగను ఆచారం మేరకు వారం రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు గ్రామంలో ఉన్న సంకుదేవతకు పూజలు చేశారు. రెండో రోజు గ్రామంలోని మహిళ పురుషులకు స్నానం చేసేందుకు నీరు దించి, భోజనాలు పెడతారు. అనంతరం కొంత మంది గ్రామ పెద్దలు చెట్టుపైకి ఎక్కి మహిళలకు ఊయలలు కడతారు. ఆ రోజు నుంచి మహిళలంతా కలిసి గిరిజన ఆచార పాటలు పాడుతూ ఊయలలు ఊగుతు సందడి చేస్తారు. మూడో రోజు పెద వేట పేరుతో గ్రామ సమీపంలో థింసా నృత్యాల ప్రదర్శనలతో సందడి చేస్తారు. గ్రామస్తులకు చెందిన కత్తులు, గొడ్డళ్లు, ఈటెలు అన్ని ఒకే చోట పెట్టి గ్రామ పూజారి పూజలు చేసిన అనంతరం కోడి గుడ్డును కొట్టి వేటను ప్రారంభిస్తారు. ఆ తరువాత మూడు రోజుల పాటు గ్రామంలో యువకులు, చిన్నా,పెద్దా తేడ లేకుండా కొండపైకి వేటకు వెళ్తారు. మహిళలంతా కలిసి గ్రామ సమీప ప్రధాన రహదారుల్లో పాజోరి పేరుతో వాహనాలను అడ్డుకుని పాటలు పాడుతూ వాహన చోదకులకు సరదాగా నీరు పోస్తూ చందాలు వసులు చేయనున్నారు. చివరి రోజున సాయంత్రం సంకుదేవ ప్రాంగణంలో పూజారి పూజలు చేసిన తరువాత విత్తనాలు వేస్తారు.
ఘనంగా ఇటుకల పండగ ప్రారంభం


