రెజ్లింగ్ పోటీల్లో గిరిజన విద్యార్థుల సత్తా
స్వర్ణ పతకాలు సాధించి
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
రంపచోడవరం: ముసురుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, ఎర్రంపాలెం గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రెజ్లింగ్‌లో సత్తా చాటారు. రాజమహేంద్రవరంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో అండర్ – 15లో సీహెచ్ భువన్ కుమార్ 41 కిలోలు, కె.కిరణ్‌దొర 48 కిలోలు, పి.జె.ప్రకాష్ 38 కిలోల విభాగంలో బంగారు పతకాలు సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎర్రంపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చోడి భవిత స్వర్ణ పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఇదే పాఠశాలకు చెందిన రేపల్లి కీర్తన, వీరా ఆనందిత 62 కిలోల విభాగంలోను, పండా సంజన 58 కిలోల విభాగంలో మూడో స్థానం నిలిచారు.హెచ్‌ఎం ఎస్. ఆదివిష్ణు, పీడీ సుగంధి ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ రుక్మాండయ్యను కలిశారు. డీడీ వారిని అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి ఏజెన్సీ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.


