గిరి గ్రామాల్లో ఇటుకల పండుగ సందడి
అరకులోయటౌన్: గిరి గ్రామాల్లో ఇటుకల పండుగ సందడి ప్రారంభమైంది. గ్రామాల్లో నిర్వహిస్తున ఈ పండుగలో మహిళలదే ఆధిపత్యం. వ్యవసాయ పనులకు ముందు జరపుకునే ప్రత్యేకమైనది ఇటుకల పండుగ. ఈ పండుగ చివరి రోజు గ్రామ నాయుడు, తలయారి, పూజారులు వారం రోజుల పాటు పూజలు చేసిన విత్తనాలు గ్రామంలోని రైతులకు అందిస్తారు. ఈ విత్తనాన్ని తమ భూముల్లో మొట్టమొదటి సారి చల్లిన తరువాతే వ్యవసాయ పనులు చేపడుతారు. ఇటుకల పండగ నేపథ్యంలో గ్రామంలోని మహిళలు రోడ్డుపైకి వచ్చి వాహనాలను ఆపి పజోర్(డబ్బులు) వసూలు చేస్తారు. గ్రామంలోని పురుషులందరూ అడవిలో వేటకు వెళ్తారు... ఎవరైనా వేటకు వెళ్లని పక్షంలో వారికి మహిళలు జరిమానా విధిస్తారు. వేటకు వెళ్లి ఏదైనా జంతువును వేటాడి చంపితే అతనికి పూల మాలలు వేసి, డప్పు వాయిద్యాల నడుమ థింసా నృత్యాలతో గ్రామానికి తీసుకువచ్చి సన్మానిస్తారు. హోలిని తలపించే విధంగా రంగులు పూసుకొని వారం రోజులు సరదాగా గడుపుతారు. పండుగ చివరి రోజు పజోరు ద్వారా వసూలు చేసిన డబ్బులతో పిండి వంటలు చేసుకొని గ్రామస్తులంతా వింధు భోజనాలు చేసి పండుగ ముగిస్తారు. గ్రామ దేవత వద్ద పూజలు చేసిన విత్తనాన్ని పొలాల్లో జల్లడంతో అధిక దిగుబడులు వస్తాయనే గిరిరైతుల నమ్మకం. ఈ పండుగ ముగిసిన మరుసటి రోజు నుంచి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.
గిరి గ్రామాల్లో ఇటుకల పండుగ సందడి


