నిబంధనల మేరకే క్వారీల నిర్వహణ
రంపచోడవరం: ఏజెన్సీలోని పలు మండలాల్లో క్వారీలు లీజుకు తీసుకున్న నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పక్కాగా పాటించాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం ఆదేశించారు. గురువారం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాలులో క్వారీల నిర్వాహాకుల ప్రతినిధులు, మైనింగ్ అధికారులతో రంపచోడవరం సబ్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీతో కలిసి ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని 11 మండలాల్లో మొత్తం 33 క్వారీలు ఉన్నాయన్నారు. ఇందులో 14 క్వారీలు పని చేస్తున్నాయని, మిగతా 19 క్వారీలు ప్రభుత్వం నుంచి అనుమతులు లేని కారణంగా ఆపి వేశామన్నారు. వై.రామవరం, రాజవొమ్మంగి, ఏటపాక, వీఆర్ పురం, కూనవరం మండలాల్లో ఏవిధమైన క్వారీలు లేవని ఆయన తెలిపారు. క్వారీ నిర్వాహకులు క్వారీల సమీపంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రభుత్వ నిబంధనలు పక్కాగా అమలు చేయాలన్నారు. క్వారీల్లో ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పీవో ఆదేశించారు. సబ్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సొసైటీ ఏర్పాటు చేసుకొని క్వారీ నిర్వహణకు అనుమతులు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం క్వారీలు నిర్వహిస్తున్న యాజమానులు ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి యం.ఆనంద్, సర్వేయర్ కాళిదాసు, క్వారీ నిర్వహణ యాజమాన్యం కోసూరి సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీవో సింహాచలం ఆదేశం


