దళారులకు పక్షపాత వైఖరి తగదు
వి.ఆర్.పురం: లంక పొగాకు కొనుగోలులో దళారులు పక్షపాత వైఖరి వీడాలని జెడ్పీటీసీ సభ్యుడు వి.రంగారెడ్డి, నాయకులు బి.నరసింహారావు, ఎం.సిద్ధూ, ఎం.శంకర్ తదితరులు కోరారు. మండల కేంద్రంలోని పొగాకు గొడౌన్‌లను వారు గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళారులు పొగాకు కోతకు ముందు కిలో పొగాకు రూ.183 ఇస్తామని ప్రకటించి, పంట చేతికొచ్చిన తరువాత మోడు తీసిన పొగాకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, ధరలు కూడా తగ్గిస్తున్నారన్నారు. దీంతో రైతులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు మంచి డిమాండ్ ఉందని, ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.


