వెల్లువెత్తిన వినతులు
పాడేరు : మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశపడి ఎన్నో వ్యయప్రయాసాలు ఓర్చి సుదూర ప్రాంతాల నుంచి ఐటీడీఏకు తరలివస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. కాళ్లరిగేలా పదేపదే తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అధికారుల తీరుపై ఫిర్యాదుదారులు అసహానం వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై పదేపదే అర్జీలిస్తున్నా అధికారులు ఎందుకు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి వందలాది సంఖ్యలో ఫిర్యాదుదారులు తరలివస్తున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఐటీడీఏ పీఓ, సబ్ కలెక్టర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీంతో తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశ పడుతున్న ప్రజలకు నిరాశ ఎదురవుతోంది. ఫిర్యాదులు స్వీకరిస్తున్న అధికారులు వాటి పరిష్కారారానికి తగిన రీతిలో చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, డీఆర్వో పద్మాలత ప్రజల నుంచి 110 వినతులను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా ఉమ్మడి సమస్యలపైనే ఫిర్యాదులు అందాయి.
● చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ కుట్టువీధి గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కలెక్టర్ దినేష్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
● పాడేరు మండలం బంట్రోత్‌పుట్టు గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం అసంపూర్తిగా ఉందని తక్షణమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రాన్ని అందజేశారు.
● జి.మాడుగుల మెయిన్ రోడ్డు నుంచి చుట్టుమెట్ట గ్రామం వరకు రింగ్ రోడ్డు నిర్మించాలని స్థానికులు వంతాల తిమోతి వినతిపత్రాన్ని అందజేశారు.
● హుకుంపేట మండలం కామయ్యపేట రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని తడిగిరి, తీగలవలస గ్రామస్తులు కలెక్టర్ దినేష్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
● ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ బొడ్డగొంది గ్రామంలో పాఠశాల భవనం మంజూరు చేయాలని సర్పంచ్ భాగ్యవతి వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యలపై ప్రతి శుక్రవారం అర్జీలు అందజేస్తున్న అధికారులు పరిష్కారానికి ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు.
అపరిష్కృతంగా సమస్యలు
గ్రామాల్లో సమస్యలపై ఫిర్యాదుకు
క్యూ కడుతున్న ప్రజలు
మీ కోసంకు 110 వినతులు


