క్షణక్షణం.. భయం భయం
సాక్షి, విశాఖపట్నం: మందుగుండు సామగ్రికి అనకాపల్లి జిల్లా ఎంతో ప్రసిద్ధి. పెళ్లిళ్లు, అమ్మవారి పండగలు, ఇతర ఉత్సవాలకు బ్రాండెడ్ సంస్థలు బాణసంచాను అందించలేవు. అందుకే.. లోకల్‌గా ఉన్న తయారీ కేంద్రాలపై ఆధారపడుతుంటారు. ఇక్కడ జనం కోరిన విధంగా బాణసంచా తయారుచేస్తారు. పేల్చినప్పుడు ఏ రంగు రావాలి, ఎలాంటి సౌండ్ రావాలి, ఎలా దూసుకెళ్లాలి.. ఇలాంటి స్పెషల్ క్రాకర్స్ రూపొందిస్తారు. ఒక దుకాణంలో పనిచెయ్యడం.. అక్కడ ఎలా తయారు చేస్తున్నారో అవగాహన పెంచుకొని.. వేరే చోట తయారీ కేంద్రం పెట్టడం.. ఇలా జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఉమ్మడి విశాఖతోపాటు తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాలోని ప్రాంతాలవారికీ అనకాపల్లి నుంచే బాణసంచా సరఫరా చేస్తారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో బాణసంచా తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. మొత్తం 40 కేంద్రాలున్నట్టు అంచనా. కానీ.. ఇందులో లైసెన్సులు తీసుకొని నడుపుతున్నవి మాత్రం 21 మాత్రమే. మిగిలిన 19 దుకాణాలకు లైసెన్స్ లేదని తెలిసినా.. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కారణం.. నెలనెలా వసూళ్ల పర్వం నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 40 దుకాణాలున్నాయని చెబుతున్నప్పటికీ.. మరో 20 వరకూ తయారీ కేంద్రాలను గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్నారని తెలుస్తోంది. వీటి విషయంలోనూ ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదు.
కనీస పరిశీలనలు శూన్యం.!
దరఖాస్తు వచ్చిందా.. లైసెన్స్ ఇచ్చేశామా.. వదిలేశామా.. అనే రీతిలోనే బాణసంచా తయారీ దుకాణాల విషయంలో జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆ దుకాణంలో ఏం తయారు చేస్తున్నారు.? మోతాదుకు మించిన నిల్వలున్నాయా.? గోదాముల పరిస్థితేంటి అనేది పట్టించుకున్న పాపానపోలేదు. అంతేకాదు.. లైసెన్స్‌లు మంజూరు చెయ్యాలని కొందరు దుకాణదారులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్ని పెండింగ్‌లో ఉంచారే తప్ప.. ఆ దుకాణాల దగ్గరకు వెళ్లి.. వాటిని పరిశీలించిన దాఖలాలూ కనిపించడం లేదు.
ఇక్కడ తయారీ కేంద్రాల పరిస్థితేంటో?
కై లాసపట్నంలో ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తత నటిస్తూ హడావిడి చెయ్యడం మొదలు పెట్టారు. జిల్లాలోని అన్ని తయారీ కేంద్రాల్ని పరిశీలించేందుకు బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా ప్రకటించారు. ఏవైనా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంటే వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రమాదం జరిగిన విషయం దావానలంలా వ్యాపించడంతో.. మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటున్నారు. రాంబిల్లి, దేవరాపల్లి, సబ్బవరం, అనకాపల్లి మండలాల్లో ఈ తరహా తయారీ కేంద్రాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు తమ వద్ద ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే ఫార్మా పరిశ్రమల్లో నెలకో ప్రమాదం సంభవిస్తుండటంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. తాజాగా.. బాణసంచా ప్రమాదం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది.
మందుగుండుకుఅనకాపల్లి జిల్లా ప్రసిద్ధి
జిల్లాలో అధికారికంగా21 తయారీ కేంద్రాలు
రెట్టింపు సంఖ్యలోగుర్తింపులేని యూనిట్లు
పట్టించుకోని అగ్నిమాపక శాఖ అధికారులు
ఇప్పటికే ఫార్మా ప్రమాదాలతో ఉక్కిరిబిక్కిరి
నిబంధనలు బేఖాతర్
బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల నిర్వహణ నిబంధనల ప్రకారం నడవాల్సి ఉంటుంది. తయారీ కేంద్రాల నిర్వహణకు కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, ఫైర్, పోలీస్ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పేలుడు పదార్థాల చట్టం 1908 ప్రకారం నిర్దిష్ట ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. అత్యధిక సమయాల్లో అనుమతి లేకుండానే బాణసంచా తయారీ కోసం ప్రయత్నించడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. లైసెన్స్ తీసుకున్న యూనిట్లలో కూడా ప్రమాణాలకు విరుద్ధంగా పరిమితికి మించి ఉత్పత్తి కోసం చేసే యత్నాల్లో నిబంధనలు అతిక్రమించడం మరో కారణం. బాణసంచా తయారీలో నిబంధనలను పాటించకుండా, లాభార్జనే ప్రధానంగా వ్యవహరించడం ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికార యంత్రాంగం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. భారీ పేలుడు సంభవించేందుకు ఆస్కారమున్న పదార్థాలను ప్రత్యేకంగా నిల్వ ఉంచాలి. కానీ అందుకు విరుద్ధంగా భద్రత లేని చోట్ల అన్ని రకాల బాణసంచాని కలిపి ఉంచుతుంటారు. తయారీదారులు ఫైర్ ఫైటింగ్ విషయాల్లో శిక్షణ తీసుకోవాలి. బాణసంచా దుకాణం వద్ద తయారీ ప్రదేశాలలో ప్రథమ చికిత్స కిట్లు తప్పనిసరిగా ఉండాలి. నాలుగు ఫైర్ సిలెండర్లు, నాలుగు బకెట్లు, నిమిషానికి 450 లీటర్ల కెపాసిటీ గల ఒక డీజిల్ పంపు, 25 వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకు ఉండాలి. అనుమతులకు మించి బాణసంచా సరుకులను తయారు చేయకూడదు. ప్రమాద నివారణ పరికరాలు పనిచేసే విధంగా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. పరికరాలను ఉపయోగించేందుకు నలుగురు ఆపరేటర్లు ఉండాలి. తయారీ దుకాణంలో నలుగురికన్నా ఎక్కువ పనిచేయకూడదు. కేంద్రం చుట్టూ రక్షణను ఏర్పాటు చేయాలి. 1908 ఎక్స్‌ప్లోజివ్ చట్టం ప్రకారం అన్ని నిబంధనలు పాటించాలి. తయారీ కేంద్రం దృఢంగా సిమెంటుతో నిర్మించాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి పనిచేసే వారు బట్టలకు తడి చేసుకుంటూ ఉండాలి. ఇలా ఎన్నో నిబంధనలున్నా.. వాటిని పాటిస్తున్న తయారీ కేంద్రాలు జిల్లాలో లేవనే చెప్పొచ్చు. అయినా.. అధికారుల కళ్లకు ఇవేమీ కనిపించకపోవడం గమనార్హం.
క్షణక్షణం.. భయం భయం


