మృత్యు కుహరం.. ‘సరియా’
సాక్షి, పాడేరు: జిల్లాలోని సరియా జలపాతం మృత్యు జలపాతంగా పేరోందింది. అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలో ఉన్న సరియా జలపాతం అందాలకు నిలయమైనప్పటికీ ప్రమాదాలతో మరణాలు సంభవిస్తున్నాయి. మైదాన ప్రాంతాలకు దగ్గరగా ఉండడంతో అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు సరియా జలపాతం సందర్శనకు వస్తుంటారు. గత 20 ఏళ్ల నుంచి సరియా జలపాతం వెలుగులోకి వచ్చింది. ఈ జలపాతం అందాలపై విస్తృత ప్రచారం జరగడంతో అనేక రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి అధికమైంది. దేవరాపల్లి మీదుగా సరియా ప్రాంతానికి రోడ్డు అభివృద్ధి చెందడంతో పర్యాటకులు వాహనాలతో అక్కడకు చేరుకుంటున్నారు. సరియా జలపాతం అందంగా దర్శనమిస్తున్నప్పటికీ ప్రమాదాలకు నిలయంగా మారింది.స్నానాలకు దిగిన పర్యాటకులు ఏ మాత్రం కాలుజారిన సరాసరి దిగువున ఉన్న సెలయేరులోకి జారిపోతారు.ఆ సేలయేరులో సొరంగం కూడా ఉండడంతో ఈలోతు ప్రాంతంలోకి గల్లంతవుతారు. గల్లంతైన వారు మాత్రం ప్రాణాలతో భయటపడే పరిస్థితి లేదు. మృతదేహాలు మాత్రమే వెలుగు చూస్తున్నాయి.
15ఏళ్లలో 37మంది పర్యాటకులు మృతి
జిల్లాలోని అనేక జలపాతాలు ఉన్నప్పటికీ సరియా జలపాతం మాత్రం మృత్యు జలపాతంగా భయపెడుతుంది. ఆదివారం గల్లంతై మృతి చెందిన విశాఖకు చెందిన వాసు, నరసింహమూర్తిలతో కలుపుకుని గడిచిన 15ఏళ్లలో 37మంది పర్యాటకులు సరియా జలపాతంలో పడి మృతిచెందినట్టు పోలీసు రికార్డుల్లో నమోదైంది. మూడు స్టెప్‌లలో దర్శనమిస్తున్న సరియా జలపాతంలో స్నానాలు చేయడం వరకు ప్రమాదం లేనప్పటికీ దిగువకు జారిపడితే మాత్రం ప్రాణాలు పోయినట్టే.
పోలీసుల హెచ్చరికలు బేఖాతర్
సరియా జలపాతంలో ప్రమాదాల నివారణకు పోలీసుశాఖ రెండేళ్ల క్రితం అనేక చర్యలు చేపట్టింది. ప్రమాదాలు అఽధికంగా జరిగే జలపాతం మొదటి స్టెప్ చుట్టూ ఫెన్సింగ్ వేశారు. హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే సరియా ప్రాంతానికి చెందిన 11 మంది గిరిజన యువకులను వలంటీర్లుగా నియమించడంతో వారంతా ప్రమాదాల నివారణకు కృషి చేయడంతో ప్రమాదాలు తగ్గాయి.. అయితే రెండవ స్టెప్‌లోని జలపాతం కూడా ప్రమాదకరంగా మారింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో విశాఖకు చెందిన నేవి ఉద్యోగి దిలీప్‌కుమార్, విజయనగరం బాబామెట్ట ప్రాంతానికి చెందిన సాయిలు రెండవ స్టెప్‌లోని జలపాతం వద్ద స్నానాలకు దిగి గల్లంతయ్యారు. ఒకరోజంతా గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు వెలుగుచూశాయి. ఈ సంఘటనతో పోలీసుశాఖ మరింత అప్రమత్తమైంది. వలంటీర్లతో భద్రత చర్యలను విస్తృతం చేసింది.అయితే ఆదివారం మరో ఇద్దరు యువకులు గల్లంతై మృత్యువాత పడడంతో మరలా సరియా జలపాతంలో మృత్యుఘోష పర్యాటకులు, స్థానికులను భయపెడుతుంది. పోలీసుల హెచ్చరికలను పర్యాటకులు కనీసం పట్టించుకోకపోవడంతో సరియా జలపాతంలో మరణాలు సంభవిస్తున్నాయని పలువురు చెబుతున్నారు. మృతి చెందుతున్న పర్యాటకుల కుటుంబాల్లో విషాదం అలముకుంటుంది.
జారితే...గల్లంతే
ప్రాణాల మీదకు తెస్తున్న స్నానాల సరదా
ప్రమాదకరంగా సేలయేరులో లోతు
పోలీసు హెచ్చరికలు పట్టని పర్యాటకులు


