పట్టపగలే చుక్కలు చూపిస్తారు..
అనకాపల్లి: సాధారణంగా రాత్రి పూట దొంగతనాలు చేస్తారు.. అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఎవరికీ కనబడకుండా పని కానిచ్చేస్తారు.. కానీ ఈ ముఠా మాత్రం ఎంచక్కా పగలే చోరీలు చేస్తారు.. గుట్టుచప్పుడు కాకుండా, పక్కింటికి కూడా తెలీకుండా ఇళ్లు దోచేస్తారు.. అదీ వారి ప్రత్యేకత. వారి పనితనం చూసి పోలీసులే విస్తుపోయారు. ఎస్పీ తుహిన్ సిన్హా తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీసులకు చిక్కిన ఈ ముఠా వివరాలు వెల్లడించారు. ఈ బృందంలో ఒక బాలుడితో సహా ఆరుగురు ఉన్నారు. అందరూ దగ్గరి బంధువులే. వీరు 2023 నుంచి ఇంతవరకు మొత్తం 21 దొంగతనాల్లో పాల్గొన్నారు. వీరి నుంచి 63 తులాల బంగారం, 6.5 తులాల వెండి వస్తువులు, రూ.15 వేల నగదును కోటవురట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటవురట్ల మండలం రాజుపేట గ్రామానికి చెందిన పొలమరశెట్టి దుర్గాప్రసాద్, భీశెట్టి లోకేష్, యల్లపు భూపతి, మడుతూరి సూర్య, మునగపాక మండలం జంగాలవీధికి చెందిన దొడ్డి ఆదిబాబుతో పాటు కోటవురట్ల మండలానికి చెందిన ఒక బాలుడు ఈ ముఠాలో ఉన్నారు. ప్రధాన నిందితుడు పొలమరశెట్టి దుర్గాప్రసాద్ చిన్నతనంలో తండ్రి మరణించడంతో జల్సాలకు బానిపై ఆన్‌లైన్ బెట్టింగ్ చేసేవాడు. డబ్బుల కోసం చోరీలకు అలవాటు పడ్డాడు. దొంగలించిన బంగారాన్ని తన బావమరిది దొడ్డి ఆదిబాబు వద్ద భద్రపరిచేవాడు. అప్పటికే ఆదిబాబు తొమ్మిది మోటార్ సైకిల్ దొంగతనాల కేసుల్లో నిందితుడు. పై ఆరుగురు వ్యక్తులు రెండేళ్ల కాలంలో కోటవురట్ల మండలంలో 6, నర్సీపట్నం రూరల్‌లో 3, మాకవరపాలెంలో 3, కశింకోటలో 3, బుచ్చెయ్యపేటలో 2, యలమంచిలి టౌన్‌లో 1, నాతవరం మండలంలో 1, యలమంచిలి రూరల్‌లో 2 చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నామన్నారు. కశింకోట మండలంలో చోరీ మాత్రమే రాత్రి పూట చేశారని, మిగిలినవి ముందుగా పగటి వేళ రెక్కీ నిర్వహించి, ఉదయం పూట దర్జాగా చేశారని ఆయన పేర్కొన్నారు. బుధవారం నిందితులను కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని, బాలుడిని జువనైల్ హోమ్‌కు తరలించామన్నారు.
జాగ్రత్త సుమా
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ప్రశ్నించాలని, విలువైన ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని ఎస్పీ సూచించారు. గృహాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వలన చోరీలకు పాల్పడిన వ్యక్తులను తొందరగా పట్టుకోగలమన్నారు. అనంతరం పై కేసుల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందిని ప్రశంసాపత్రాలతో ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐ కె.అప్పలనాయుడు, నక్కపల్లి సర్కిల్ సీఐ ఎల్.రామకృష్ణ, ఎస్‌ఐలు ఎస్.రమేష్, పి.రమేష్, సీసీఎస్ ఏఎస్‌ఏ కేజేఐజీపీ కుమార్, విశ్వేశ్వరరావు, హెచ్‌సీ శివ తదితరులు పాల్గొన్నారు.
తాళం వేసుంటే ఇట్టే దోచేస్తారు
రెండేళ్లలో 21 దొంగతనం కేసులు
బాలుడితో సహా ఆరుగురు ముఠా అరెస్టు
నిందితుల నుంచి 63 తులాల బంగారం, 6.5 తులాల వెండి, రూ.15 వేల నగదు స్వాధీనం
పట్టపగలే చుక్కలు చూపిస్తారు..


