ఆగని మృత్యుఘోష
కై లాసపట్నం పేలుడులో గాయపడిన మరొకరు మృతి
కోటవురట్ల: బాణసంచా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగరాజు నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. కై లాసపట్నంలోని విజయలక్ష్మి గణేష్ ఫైర్ క్రాకర్స్‌లో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 8 మంది గాయపడిన సంగతి తెలిసిందే. అందులో రాట్నాలపాలేనికి చెందిన జల్లూరి నాగరాజు (50) 90 శాతం కాలిన గాయాలతో విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. కాగా మెడికవర్‌లో చికిత్స పొందుతున్న విజయలక్ష్మి గణేష్ క్రాకర్స్ మేనేజర్ మడగల జానకీరాం పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
మిన్నంటిన రోదనలు
నాగరాజు మృతదేహం విశాఖ నుంచి కోటవురట్ల శివారు రాట్నాలపాలేనికి సాయంత్రం 6.30 గంటలకు చేరుకుంది. ఉదయమే నాగరాజు మృతి చెందిన సంగతి గ్రామంలో తెలియడంతో విషాదఛాయలు అలముకున్నాయి. వివాద రహితుడు, అందరితో మంచిగా తిరిగే నాగరాజు మృతి అందరినీ కన్నీరుపెట్టించింది. భార్యా పిల్లలు గుండెలవిసేలా రోదించారు. వారిని ఆపడం ఎవరితరం కాలేదు. మృతుడు నాగరాజుకు భార్య అప్పలనర్స, కుమారుడు దుర్గాప్రసాద్, కుమార్తె మౌనిక ఉన్నారు. కన్నీటి రోదనల మధ్య నాగరాజు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
ఆగని మృత్యుఘోష


