
లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్
కశింకోట: కశింకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను అతి కష్టం మీద బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. సీఐ అల్లు స్వామినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేరళ నుంచి ఒడిశా వైపు వెళ్తున్న తమిళనాడుకు చెందిన లారీ వేగంగా వచ్చి ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. దీంతో తమిళనాడు లారీ డ్రైవర్ ముత్తు స్వామి పళని కాలు విరిగి తీవ్రంగా గాయపడి లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. పోలీసులు ఆయనను అతి కష్టం మీద బయటకు తీసి అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో నిలిచిపోయిన లారీని రెండు జేసీబీల సహాయంతో అడ్డు తొలగించారు. ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతింది. సంఘటన వల్ల నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పోలీసులు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి క్రమబద్ధీకరించారు.