
26 నుంచి ఏయూ శతాబ్ది ఉత్సవాలు
విశాఖ సిటీ : ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 26న ప్రారంభం కానున్నాయని ఏయూ ఉపకులపతి ప్రొ.రాజశేఖర్ తెలిపారు. అకడమిక్ సెనేట్ మందిరంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వందేళ్ల ఉత్సవానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలి రోజు ఉదయం 6 గంటలకు ఆర్‌కే బీచ్ నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకూ శతాబ్ది వాక్‌థాన్‌తో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయని తెలిపారు. ఉదయం 9 గంటలకు ఏయూ పరిపాలన భవనం వద్ద బెలూన్ లాంచింగ్ అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రధాన వేడుకలకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.మధుమూర్తి, ఐఐటీ పాలక్కడ్ డైరెక్టర్ ప్రొ.శేషాద్రి శేఖర్ అతిథులుగా హాజరవుతారన్నారు. ఇందులో భాగంగా విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఏడాది పొడవునా విభిన్న కార్యక్రమాలతో నిర్వహించే శతాబ్ది ఉత్సవాల వార్షిక క్యాలెండర్‌ను కూడా ఆవిష్కరిస్తామన్నారు. విశ్వవిద్యాలయంలో నూతన భవనాలు, సెంట్రల్ ల్యాబ్ ఫెసిలిటీ, పూర్వ విద్యార్థుల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన జ్ఞాపికగా ప్రత్యేక ఐకానిక్ టవర్‌ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు.