
గిరిజనుల భవిష్యత్తుతో ఆటలొద్దు
సాక్షి,పాడేరు/పాడేరు రూరల్: గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాలు కల్పించే జీవో నంబర్ 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవో సాధన,ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ డిమాండ్‌తో ఆదివాసీ ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. పలు ఆదివాసీ ప్రజాసంఘాలు శనివారం జిల్లా కేంద్రం పాడేరులోని కాఫీ అతిథి గృహంలో సమావేశమయ్యాయి.స్పెషల్ డీఎస్సీ సాధన డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్త చర్చా వేదికను నిర్వహించాయి. ప్రతి సంఘం నుంచి ఆదివాసీ నాయకులు గిరిజన సమాజం అభివృద్ధి అజెండాగా మాట్లాడారు. గిరిజనుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా ఓ గిరిజన బిడ్డగా అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి కూడా ఈచర్చవేదికకు హాజరై ఆదివాసీల పక్షాన తన గళం వినిపించారు. జీవో నంబర్ 3 పునరుద్ధరణకు పార్లమెంట్‌లో పోరాడుతున్నానని, గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల కల్పన,ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన పోరాటానికి తాను అన్ని విధాల సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ఎంపీ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు జీవో నంబర్ 3 పునరుద్ధరణ,లేని పక్షంలో ప్రత్యామ్నాయ జీవో తెచ్చే బాధ్యత సీఎం చంద్రబాబుదేనని, నూరుశాతం ఉద్యోగ,ఉపాధ్యాయ పోస్టుల భర్తీని వెంటనే అమలుజేయాలని ఈ చర్చా వేదికలో ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సమష్టిగా పోరాడి హక్కులు సాధించుకోవాలని తెలిపారు. మెగా డీఎస్సీని రద్దు చేసి ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని కోరారు.
వచ్చేనెల 2 నుంచి నిరవధిక బంద్
జీవో నంబర్ 3 పునరుద్ధరణ,ఆదివాసీల స్పెషల్ డీఎస్సీ సాధన డిమాండ్‌తో ఆదివాసీ ప్రజా సంఘాలు దశలవారీ ఆందోళనకు కార్యాచరణ రూపొందించాయి. ఈనెల 28న మండల కేంద్రాల్లో అన్ని సంఘాలతో సమావేశాలు, 29న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పత్రాలు దహనం, 30న రాష్ట్ర గిరిజన మంత్రి, గవర్నర్‌లకు వినతిపత్రాలు అందజేత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. మే 2వతేదీ నుంచి నిరవధిక మన్యం బంద్‌కు పిలుపునిచ్చాయి.
జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో బాధ్యత సీఎం చంద్రబాబుదే
ఆదివాసీ స్పెషల్ డీఎస్సీని వెంటనే
ప్రకటించాలి
ఆదివాసీ ప్రజాసంఘాల డిమాండ్
28 నుంచి దశలవారీగా ఉద్యమం
మే 2 నుంచి నిరవధిక మన్యం బంద్‌కు కార్యాచరణ
ఉద్యమానికి అరకు ఎంపీ తనూజరాణి మద్దతు