
అనుమానాస్పద స్థితిలో రిటైర్డ్ ఉద్యోగి మృతి
పాడేరు : పాడేరు–పెదబయలు ప్రధాన మార్గంలో చింతలవీధి జంక్షన్ సమీపంలో అనుమానస్పద స్థితిలో కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి మృతి చెందారు. పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టు వీధికి చెందిన కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి జవ్వాది మత్య్సలింగం (62)గురువారం తమ బంధువు చనిపోవడంతో కొత్తపల్లి గ్రామానికి వెళ్లారు. కార్యక్రమం ముగించుకొని ద్విచక్ర వాహనంపై పాడేరు వస్తున్న ఆయన చింతలవీధి జంక్షన్ సమీపంలో రహదారిపై పడి ఉన్నారు. తీవ్ర గాయాలతో ఉన్న అతనిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మత్య్సలింగం ద్విచక్ర వాహనంపై ఎక్కడికి వెళ్లినా హెల్మెట్ ధరిస్తారని, గురువారం సంఘటన జరిగిన స్థలంలో కూడా హెల్మెట్ దూరంగా పడి ఉందని వారు వివరించారు. ఏం జరిగిందనేది అంతుచిక్కడం లేదని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.