
నిత్యావసరాలు కూడా సరిగా అందలేదు
వీఆర్ పురం: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి సోమవారం పర్యటించారు. చింతరేవుపల్లి, గుండుగూడెం, పత్తిపాక, రేఖపల్లి, ఒడ్డుగూడెం, ఒడ్డుగూడెం కాలనీ, రాజుపేట గ్రామాల్లో వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో ప్రమాదస్థాయి దాటి మూడుసార్లు గోదావరి వరదలు వస్తే కూటమి ప్రభుత్వం బాధితులను పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వంలో నిత్యావసరాలు, బియ్యం, బరకాలు రెండేసిసార్లు వరద బాధితులకు అందజేశామన్నారు. తమకు నిత్యావసర సరకులు అందలేదని బాధితులు ఈ సందర్భంగా వాపోయారు.
ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం
బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం రేఖపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మాదిరెడ్డి సత్తిబాబు ఇంటి వద్ద సోమవారం జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను, నిరుద్యోగులను, మహిళలను మోసం చేసిందన్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఎక్కడ అని ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగుల బదిలీకి 1.50 లక్షల లంచం తీసుకుంటున్నారన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు యూరియా బస్తాలు కూడా దొరకడం లేదన్నారు. పోలవరం నిర్వాసితుల పొలాల్లో జెండాలు పాతటం సరికాదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి, నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించేవరకు ఎవరు భూములు వారే సాగు చేసుకోవచ్చని చట్టంలో ఉందన్నారు. పార్టీ మండల కన్వీనర్ మాదిరెడ్డి సత్తిబాబు, సర్పంచ్‌లు పిట్టా రామారావు, వడ్డాణపు శారద నరసమ్మ, వైస్ ఎంపీపీ ముత్యాల భవాని, ఎంపీటీసీ బంధం విజయలక్ష్మి, కూనవరం జెడ్పీటీసీ గుజ్జా విజయ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆవుల మరియదాసు తదితరులు పాల్గొన్నారు.