
కోతకు గురైన కల్వర్టు
ముంచంగిపుట్టు: మండలంలో గిరిజన గ్రామాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తుండటంతో మాకవరం పంచాయితీ అరబీరు గ్రామానికి వెళ్లే మార్గంలో రోడ్డుపైకి మట్టిదిబ్బలు కొట్టుకొని వచ్చాయి. దీంతో అరబీరు నుంచి లబడపుట్టు గ్రామాల మధ్య బుధవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపై మట్టి దిబ్బలను వైఎస్సార్‌సీపీ నేతలు వంతాల దామోదరం, వలమంగి జీనబంధు, ఈవోపీఆర్డీ చిన్నాన్న ఆధ్వర్యంలో తొలగించారు. దీంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి.మాకవరం పంచాయతీ మొక్కపుట్టు గ్రామానికి వెళ్లే మార్గంలో కల్వర్టు వరదనీటి ఉధృతికి కోతకు గురైంది. దీంతో రాకపోకలకు గ్రామ గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీటి ప్రవాహనికి మాకవరం, దొడిపుట్టు, వనుగుమ్మ, కరిముఖిపుట్టు పంచాయతీల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి.

కోతకు గురైన కల్వర్టు