
కాఫీ రైతులను ఆదుకోండి
అరకులోయ టౌన్ : బెర్రీ బోరర్ వల్ల నష్టపోతున్న కాఫీ రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ చర్యలతోపాటు తక్షణ నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. చినలబుడు పంచాయతీ పకనకుడిలో బుధవారం జరిగిన ఆదివాసీ కాఫీ రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందల ఎకరాల్లో బెర్రీ బోరర్ ఆశించడం వల్ల కాఫీ రైతులు తీవ్ర నష్టపోతారన్నారు. కాఫీ పంటకు ఎకరాకు రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని, కిలో పచ్చి కాఫీ కాయలకు రూ.200 చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. పురుగు నివారణకు ఉపాధి హామీ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పాడేరు ఏజేన్సీలో గిరిరైతులు పండిస్తున్న కాఫీని టాటా, నాంది, టెక్నో, మాక్స్, కాఫీ హౌస్ తదితర ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నాయని, బెర్రీ బోరర్ వల్ల కాఫీ తోటలకు తీవ్ర నష్టం జరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదన్నారు. కాఫీ కొనుగోలుకు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘ నాయకులు కిల్లో మొద్దు, ముసిరి మల్లన్న, రాజు, కాఫీ రైతులు ఒనాది, ప్రతాప్, దొన్ను, డొంబు, అర్జున్, సింహాద్రి, గురుమూర్తి, చంద్రయ్య, రఘునాథ్, తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్