
హైడ్రో పవర్ ప్రాజెక్టుతో తీరని నష్టం
డుంబ్రిగుడ: హైడ్రో పవర్ ప్రాజెక్టు బాధిత గ్రామాలను వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం పర్యటించారు. కంకడకత్తుర్ గెడ్డపై హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే సహించేది లేదని పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్ ప్రభుత్వనికి హెచ్చరించారు. ఈ సందర్భంగా మండలంలోని కండ్రుమ్ పంచాయతీ కంకడకత్తుర్ సమీపంలో ఉన్న గ్రామస్తులతో మాట్లాడుతూ ఆంధ్ర– ఒడిశా సరిహద్దు ప్రాంతం గెడ్డపై కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం ఆలోచన విరమించుకోవాలని లేని పక్షంలో ఆందోళన తప్పదని డిమాండ్ చేశారు. నవయుగ, ఆదాని కార్పొరేట్ కంపెనీలకు జిల్లాలోని 30 కేంద్రాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం చేసుకుని జీవో నంబర్ 51 జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగానే మండలంలోని కంకడకత్తుర్ గెడ్డ వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణం చేపడితే కండ్రుమ్ పంచాయితీలోని ఒంబీ, దొరగుడ, సెందిరిగుడ, సర్రాయి, జోడిగుడ, జాకరవలస, కొర్రగుడ, నాగంసంపెంగిగుడ, కురిడి పంచాయితీలోని గదబగలుంగు, బల్యగు, పుట్టబంధ, నిమ్మగుడ, పెద్దచంపపుట్టు, బంధకోలని, పిత్తమరిగుడ, గోరాపుర్, ఒడిశాలోని కోరాపుట్ జిల్ల పాడువా బ్లాక్ చాటువా, తొలుడు, దొరగుడ, చాటువగేటు, కుంబిగుడ, అమ్హడ, బిల్లపుట్ట, బంక్బంజోడా గ్రామాలకు భారీగా నష్టం జరుగుతుందన్నారు. అంతేకాకుండా సుమారు 1156 కుటుంబాలు, 5 వేల మంది జనాభా, 3వేల ఎకరాల జిరాయితీ భూములతో పాటు వేల ఎకరాల్లో అటవీ భూములు, కాఫీ, బిరియాలతోటలు తదితరు మ్కొలతో పాటు వన్యప్రాణులు జలసమాధి అవుతాయన్నారు. అందువల్ల నిర్మాణ నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. వైస్ ఎంపీపీ శెట్టి ఆనందర్‌రావు, ఎంపీటీసీ రామరావు, సూపర్ ఎంపీటీసీలు పరశురామ్, మండల కార్యదర్శి మఠం శంకర్‌రావు, పోతంగి పంచాయితీ పార్టీ అధ్యక్షులు విజయదశమి, కొర్రగుడ గ్రామస్తులు తదితరలు పాల్గొన్నారు.