నక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఉపమాకలో గరుడాద్రిపై కల్కి అవతారంలో స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారికి తిరుపతిలో మాదిరిగానే ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 23 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో తిరుమల వెళ్లలేని వారు ఉపమాక వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 23న ఉదయం స్వామివారి ఉత్సవ కావిడను ఉపమాక పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ సమయంలో భక్తులు పసుపు కుంకుమలు, కొబ్బరి బొండాలు సమర్పించుకుంటారు. స్వామివారి ఉత్సవాలకు ఆహ్వానంగా ఈ ఉత్సవ కావిడను ఊరేగిస్తామని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. విష్వక్సేనులవారిని పల్లకిలో ఉంచి మత్స్యంగ్రహణం, పుట్టమన్ను తెచ్చే కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి అశ్వవాహనంపై స్వామివారి తిరువీధి సేవ జరుగుతుంది.
రోజుకో వాహనంపై తీరువీధి సేవ
బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని రోజుకో వాహనంలో ఊరేగిస్తారు. 24వ తేదీ బుధవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. రాత్రికి శేషతల్ప వాహనంపై స్వామివారి తిరువీధి సేవ నిర్వహిస్తారు. 25న హంసవాహనంపై, 26న ఇత్తడి సప్పర వాహనంపై, రాత్రి పెద్దపల్లకిలో, 27న ఆంజనేయ, లక్క గరుడ వాహనాలపై, 28న సప్పర, రాజాధిరాజ వాహనాలపై తిరువీధి సేవ నిర్వహిస్తారు. 29న వసంతోత్సవం జరుగుతుంది. 30న పుణ్యకోటి వాహనంపై తిరువీధి సేవలు నిర్వహిస్తారు. అక్టోబరు 1న మృగవేట కార్యక్రమం జరుగుతుంది, సాయంత్రం గజవాహనంలో స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి బంధుర సరస్సు వద్దకు తీసుకువస్తారు. ఉత్సవమూర్తులకు ధనుర్బాణాలకు పూజలు చేసిన తర్వాత గజవాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. అక్టోబర్ 2న విజయదశమిని పురస్కరించుకుని ఆలయంలో నిత్యసేవాకాలం, హోమాలు నిర్వహిస్తారు. ఉదయం వినోదోత్సవం, సాయంత్రం శమీపూజ జరుగుతుంది. చివరిగా ఆస్థాన మండపంలో ఉత్సవమూర్తులను ఉంచి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నాళాయిర సేవాకాలం, ద్వాదశ తిరువారాధన, నిత్యసేవాకాలం, ప్రసాద నివేదనలు మంత్రపుష్పాలు, తీర్థగోష్టి నిర్వహిస్తారు. పవళింపు సేవతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.
బ్రహ్మోత్సవాలకు వేళాయె..