
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై చర్యలు
సాక్షి, అనకాపల్లి: సోషల్ మీడియాలో మహిళలను అగౌరవపరుస్తూ అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై చర్యలు తప్పవని డీఐజీ గోపినాథ్ జట్టి హెచ్చరించారు. శనివారం విశాఖ రేంజ్ పరిధిలోని ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రతీ పోస్టును క్షుణ్ణంగా పరిశీలిస్తామని, ప్రతీ జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమిస్తామన్నారు. ఆయన పర్యవేక్షణలో ప్రత్యేక బృందాల ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అభ్యంతకర పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తరచుగా అభ్యంతకర పోస్టులు పెట్టే వారి వివరాలు సేకరించాలని, వీరికి సహకరిస్తున్న వ్యక్తులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర పోస్టులు పెట్టిన వ్యక్తులపై ఇప్పటికే 134 కేసులు నమోదు చేసి, 106 మందిని అరెస్ట్ చేశామన్నారు. 57 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగా 25 కేసులకు సంబంధించి విచారణ కూడా చేస్తున్నామని తెలిపారు. డీఎస్పీలు కూడా వారి పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో నమోదైన సోషల్ మీడియా కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, అల్లూరి ఎస్పీ అమిత్ బర్దర్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీలతో పాటు డీఎస్పీలు పాల్గొన్నారు.
విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి