టెన్షన్‌..టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

టెన్షన్‌..టెన్షన్‌

Nov 22 2025 7:30 AM | Updated on Nov 22 2025 7:30 AM

టెన్షన్‌..టెన్షన్‌

టెన్షన్‌..టెన్షన్‌

అభయారణ్యం తుపాకీల పేలుళ్లతో దద్దరిల్లుతోంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇప్పటికే జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తప్పించుకున్నారన్న అనుమానంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అడవిలో అణువణువు జల్లెడ పడుతుండటంతో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. గిరిజనులు భయానక పరిస్థితుల్లో బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిలో నెలకొంది.

రంపచోడవరం: నిత్యం ప్రశాంతంగా ఉండే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో యుద్ధవాతావరణం నెలకొంది. ఇప్పటికే వరుస ఎన్‌కౌంటర్లతో వేడెక్కింది. రెండు ఎన్‌కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా తప్పించుకున్న వారి కోసం బలగాలు జల్లెడ పడుతున్నాయి. అణువణుకు గాలిస్తున్నాయి.

పట్టు సాధించిన బలగాలు..

కొంతకాలంగా తూర్పు కనుమల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు పూర్తిగా తగ్గిపోవడంతో ఈ ప్రాంతంపై పోలీసు బలగాలు పూర్తిగా పట్టు సాధించాయి. సమాచార వ్యవస్థ ద్వారా మావోయిస్టుల కదలికలను ఎప్పటిప్పుడు తెలుసుకుంటూ వారిని కట్టడి చేయగలిగాయి. ఈ నేపథ్యంలో కొన్ని నెలలు క్రితం వై.రామవరం–కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. అప్పటినుంచి పోలీసులు మావోయిస్టుల కదలికలను అణువణువు తెలుసుకోగలిగారు. రంపచోడవరం మండలం కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కీలక నేత గాజర్ల రవి, అరుణక్కతో పాటు మరో మావోయిస్టును ఎన్‌కౌంటర్‌లో ముట్టబెట్టారు.

ఆంధ్రా,ఒడిశా సరిహద్దు ప్రాంతంలో..

మావోయిస్టులు ఉమ్మడి రాష్ట్రంలో నల్లమల, నార్త్‌ తెలంగాణ, దండకారణ్యం, ఏవోబీ నుంచి తమ కార్యకలాపాలు సాగించే వారు. నల్లమలలో మావోయిస్టు పూర్తి ఉనికి కోల్పోయిన తరువాత ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ (ఏవోబీ)పై దృష్టి పెట్టారు. వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో ఏవోబీలో కూడా మావోయిస్టుల కదలికలు తగ్గుముఖం పట్టాయి. స్థానిక గిరిజన యువత ఎవరు మావోయిస్టు ఉద్యమంలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని, అందువల్లనే ఇక్కడ ఎటువంటి రిక్రూట్‌మెంట్‌కు అవకాశాలు లేవని పోలీసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం మావోయిస్టులకు సేఫ్‌ జోన్‌, షెల్టర్‌ జోన్‌ కాదని, అటువంటి ప్రాంతానికి మావోయిస్టు పార్టీ కీలక నేతల ఎందుకు వచ్చారనే దానిపై కూడా చర్చ అంతటా వినిపిస్తోంది.

అంతటా అప్రమత్తం

సాధారణంగా మావోయిస్టులు సీలేరు నదికి అటు ఇటు ఎక్కువగా కదలికలు కనిపించేవి. దండకారణ్యం, ఏవోబీలో పోలీస్‌ నిర్బంధం, కూంబింగ్‌ ముమ్మరమైనప్పుడు విశాఖ,తూర్పు సరిహద్దు అటవీ ప్రాంతానికి రావడం, అక్కడ నుంచి ఏవోబీలోకి వెళ్లేవారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు చత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన మావోయిస్టులు ఇటీవల వై.రామవరం అప్పర్‌ పార్ట్‌లో సంచరించారు. దీనిపై పక్కా సమాచారం సేకరించిన పోలీసులు కొంత మంది మావోయిస్టు సానుభూతి పరులను, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా జరిగిన వరుస ఎన్‌కౌంటరర్ల నేపథ్యంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరు లోతట్టు ప్రాంతాలకు వెళ్ల వద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఏజెన్సీలో భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు.

గాలింపు ముమ్మరం

మారేడుమిల్లి అటవీప్రాంతంలో

యుద్ధ వాతావరణం

ఇప్పటికే తాజా ఎన్‌కౌంటర్లలో

13 మంది మావోయిస్టుల మృతి

తప్పించుకున్న వారికోసం

కొనసాగుతున్న గాలింపు

భయాందోళనలో గిరిజన గ్రామాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement