అనకాపల్లి: కింగ్ కోబ్రా(రాచనాగు).. ఒకటి ఎదురుపడితేనే గుండెల్లో దడదడ మొదలవుతుంది. అలాంటిది ఒకేసారి మూడు కింగ్ కోబ్రాలు.. ఒకే చోట తారసపడితే.. చెప్పేందుకేముంది..? హడలెత్తుతూ పరుగులు తీయడమే..! దేవరాపల్లి మండలంలోని తారువ గ్రామానికి ఆనుకుని ప్రవహిస్తున్న ఏటి బాడవ గెడ్డలో మంగళవారం మధ్యాహ్నం స్థానికులకు ఇదే పరిస్థితి ఎదురయింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు అటుగా వెళ్లిన యువకులకు మూడు కింగ్ కోబ్రాలు బుసలు కొడుతూ కనిపించాయి. దీంతో వారు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.
ఈ విషయాన్ని చోడవరం అటవీశాఖ రేంజర్ బి.వి.వర్మకు ఫోన్లో తెలిపారు. ఆయన విశాఖపట్నానికి చెందిన ఈస్ట్రన్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షుడు కంఠిమహంతి మూర్తికి సమాచారం అందించారు. అటవీశాఖకు చెందిన బీట్ ఆఫీసర్ పి.శివకుమార్, ఎఫ్‌డీవో ఎం.నారాయణ తదితరులతో కలిసి పాములు ఉన్న ప్రాంతానికి మూర్తి చేరుకున్నారు. నీరు ప్రవహిస్తున్న గెడ్డకు ఆనుకుని పొదల్లో ఉన్న మూడు రాచ నాగులను సుమారు మూడు గంటల పాటు శ్రమించి అతి కష్టం మీద పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వీటిలో రెండు ఆడ జాతి పాములు కాగా ఒకటి మగ జాతికి చెందినదిగా నిర్ధారించారు. ఒక్కొక్కటి 13 నుంచి 15 అడుగుల పొడవు ఉన్నాయి. వీటిని చింతలపూడి పంచాయతీ సమ్మెద సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచి పెట్టినట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు.
మూడు కింగ్ కోబ్రాలు.. ఒకే చోట తారసపడితే..
Published Wed, Apr 5 2023 9:56 AM | Last Updated on Wed, Apr 5 2023 9:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment