వారిద్దరిదీ ఒకే గ్రామం.. ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఒకేసారి ఎస్సై కొలువు సాధించారు. ఇప్పుడా గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. వారిలో ఒకరు నిరుపేద రైతు కుమారుడైతే.. మరొకరు తన చిన్నతనంలో తండ్రిని కోల్పోయాడు. అయినప్పటికీ పేదరికాన్ని పంటి బిగువన భరించి కష్టాలను శ్రమ అనే నిచ్చెనగా చేసుకుని పట్టుదలతో చదివారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన తుది ఎస్సై మెయిన్ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు.
రావికమతం/నర్సీపట్నం: సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఇద్దరు యువకులు పట్టుదలతో చదివి ఎస్సై కొలువు పట్టారు. రావికమతం మండలం పొన్నవోలు గ్రామానికి చెందిన యువకులు పులిఖండం నాని, కొరసాల దుర్గాప్రసాద్ ఎస్సైలుగా ఎంపిక కావడంతో గ్రామంలో పండగ వాతావరణం ఏర్పడింది. వీరు నిరుపేద కుటుంబంలో పుట్టారు. నాని తండ్రి నిరుపేద రైతు.. తన ఇద్దరు కొడుకులను కష్టపడి చదివించాడు.
వీరిలో రెండో కుమారుడు నాని ఎస్సై పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. దుర్గాప్రసాద్ తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా, తన అన్నయ్య అంజి ప్రొత్సాహంతో ఉన్నత చదువులు చదివాడు. అతడి ప్రోద్బలంతో దుర్గాప్రసాద్ కష్టపడి ఎస్సై పరీక్షల్లో ప్రతిభ చూపాడు. ఇద్దరు యువకులు తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఒకేసారి ఓపెన్ కేటగిరీలో ర్యాంక్‌లు సాధించి ఎంపిక కావడంపై మండల నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దుర్గాప్రసాద్‌కు నాలుగు కొలువులు వచ్చినా..
కె.దుర్గాప్రసాద్, నాని ఎస్సైలు ఎంపిక కావడంతో రిషీ కళాశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. ఇతడికి ప్రభుత్వ కొలువులు నాలుగు వచ్చినప్పటికీ ఎస్సైగా రాణించాలనే సంకల్పంతో వాటిలో చేరలేదు. నాని ప్రస్తుతం తెలంగాణలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతడు అందుబాటులో లేకపోవడంతో నర్సీపట్నంలో దుర్గాప్రసాద్‌ను కరస్పాండెంట్ కోనా సతీష్, డైరెక్టర్ ఆర్.వై.నాయుడు, ప్రిన్సిపాల్ సిహెచ్.శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎ.భాస్కర్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ మురళీకృష్ణ సత్కరించారు. కష్టపడి చదివితే విజయం వరిస్తుందని, దానికి అనుగుణంగా సాధన చేయాలని తోటి విద్యార్థులకు దుర్గాప్రసాద్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment