● కూటమి నాయకులు నన్ను తొలగించాలని చూస్తున్నారు.. ● పీడీకి మొరపెట్టుకున్న బట్లపూడి వీఆర్పీ లలిత
తుమ్మపాల : ఉపాధి హామీ పథకంలో వీఆర్‌పీగా కొనసాగాలంటే రూ.5 లక్షల మామూళ్లు ఇవ్వాలని కూటమి నాయకులు వత్తిడి చేసి తనను తొలగించాలని చూస్తున్నారని బట్లపూడి వీఆర్పీ లలిత డ్వామా పీడీ పూర్ణిమదేవి, ఏపీడీ మణికుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, ఎంపీడీవో నరసింహరావు, ఇతర అధికారులు ముందు మొరపెట్టుకుంది. ఉపాధి హామీ పథకం మండల స్ధాయి సామాజిక తనిఖీ సమావేశం గురువారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన తనిఖీల వివరాలను డీఆర్పీలు బహిరంగంగా చదివి వినిపించారు.
బట్లపూడిలో జరిగిన 2023–24 ఉపాధి హామీ పనులపై పలు ఆరోపణలను డీఆర్పీ చదవడంతో పీడీ పూర్ణిమాదేవి వీఆర్పీని ప్రశ్నించారు. దీంతో వీఆర్పీ లలిత సమాధానం చెప్తూ కూటమి నాయకుల వత్తిడితోనే ఉపాధి కూలీలు తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, కూటమి నాయకులు చెప్పినట్టు చేస్తే తనపై ఎటువంటి ఆరోపణలు లేకుండా చేస్తామన్నారని, వారు అడిగినంత ఇవ్వలేకపోవడంతో తనపై కక్ష కట్టి తొలగించాలని చూస్తున్నారని బహిరంగంగా తెలిపింది. దీంతో పీడీ కల్పించుకుని ఇలాంటి అంశాలు తమ వద్ద ప్రస్తావించవద్దని హెచ్చరించి ఆ గ్రామ అంశాలను ముగించారు. మండలంలో మారేడుపూడి, దిబ్బపాలెం, ఊడేరు పలు గ్రామాల్లో వేతనదారుల మస్తర్ రిజిస్టర్‌లో దిద్దుబాట్లు చేసినట్టు గుర్తించామన్నారు. గైర్హాజరు వివరాలను హాజరైనట్టు దిద్దుబాట్లు చేశారని, కొన్ని చోట్ల చేసిన పనుల వివరాలపై నోటీస్ బోర్డులు లేవన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఎం.బుక్ లేకుండానే పేమెంట్లు చేసినట్టు గుర్తించామని డీఆర్పీలు చదివి వినిపించారు.
రేబాకలో ఉపాధి పనుల వివరాలను డీఆర్పీ చదవడం మొదలు పెట్టిన వెంటనే వీఆర్పీ రమాదేవి కళ్లు తిరిగి సొమ్మసిల్లిపోయింది. మధ్యాహ్నం వరకు జరిగిన సభలో ఏపీఎం సుప్రియతో పాటు పంచాయతీరాజ్ ఏఈ బాలాజీ, పలు శాఖల అధికారులు, సర్పంచ్, ఎంపీటీసీలు, వేతనదారులు పాల్గొన్నారు.


