పప్పల శంకరరావుకు చెక్కును అందజేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి : విశాఖ ఉమ్మడి జిల్లాలో వివిధ కారణాలతో మృతిచెందిన హోంగార్డుల కుటుంబానికి ఒక రోజు హోంగార్డుల జీతాన్ని అందజేయడం అభినందనీయమని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో గురువారం జిల్లాకు చెందిన హోంగార్డు పప్పుల లక్ష్మి, విశాఖ కై లాసగిరి ఆర్మీడ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో ఆమె భర్త పప్పుల శంకరరావుకు రూ.4,17,565 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డులు విధి నిర్వహణలో మృతి చెందిన లేదా పదవీ విరమణ పొందిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు హోంగార్డులంతా తమ ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను విరాళంగా అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, ఏవో ఏ.రామ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ టి.రమేష్ పాల్గొన్నారు.
టైలరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
తుమ్మపాల : షెడ్యూల్ కులాలకు చెందిన మహిళలకు టైలరింగ్ కోర్సులో స్వల్ప కాలిక నైపుణ్యాభివృద్ధి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ జిల్లా సహాయ సంచాలకుడు ఎస్.వి.ఎస్.ఎస్. రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మాకవరపాలెంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ర్ట్స్‌క్షన్ (నేక్) శిక్షణ కేంద్రంలో రాష్ట్ర నైపుణ్యాభివృధి సంస్థ ఆధ్వర్యంలో నాన్ రెసిడెన్సియల్ పద్ధతిలో శిక్షణ ఇస్తారన్నారు. కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 18 నుంచి 44 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో శిక్షణ ప్రారంభిస్తామన్నారు. శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత రంగంలో ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు.


