రోడ్డు ప్రమాదంలో ఫార్మా ఉద్యోగి మృతి
అచ్యుతాపురం రూరల్ : అచ్యుతాపురం నాలుగు రోడ్ల కూడలిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫార్మా ఉద్యోగి బగాది రమణారావు(40) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా, సంతకవిటి మండలం, జి.ఎన్.పురం గ్రామానికి చెందిన రమణారావు అచ్యుతాపురంలో అద్దెకు నివాసముంటూ పరవాడలోని ఓ ఫార్మా పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఏ షిఫ్ట్‌కు వెళ్లేందుకు ఆయన బైక్‌పై కూడలికి చేరుకున్నారు. యలమంచిలి రోడ్డు నుంచి అనకాపల్లి వైపు మలుపు తిరుగుతున్న సమయంలో బైక్‌పై వెళ్తున్న రమణారావును లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన దుర్ఘటనపై విచారణ చేపట్టి సీఐ నమ్మి గణేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు రొంగలి రాము మాట్లాడుతూ మృతి చెందిన రమణారావు కుటుంబానికి లారీ యజమానితో పాటు పరిశ్రమ యాజమాన్యం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేవీ ప్రాజెక్ట్ లారీలు ఎటువంటి అనుమతులు లేకుండా అనకాపల్లి, అచ్యుతాపురం రహదారిలో యథేచ్ఛగా తిరుగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. లారీల యాజమానులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.


