దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో విఫలం
● నల్లబ్యాడ్జీలతో దివ్యాంగుల నిరసన
అనకాపల్లి: జిల్లాలో దివ్యాంగుల హక్కుల చట్టం –2016ను తక్షణమే అమలు చేయడంలో జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో విఫలమయ్యారని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాత్రపల్లి వీరుయాదవ్ విమర్శించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)ను ప్రజల ప్రాణాలు హరించేలా మార్చారన్నారు. శనివారం స్థానిక నెహ్రూచౌక్ సంఘం కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులు ధరించి దివ్యాంగులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో దివ్యాంగులు తమ సమస్యలు పరిష్కారం కోసం వ్యయప్రయాసలకు ఓర్చి కలెక్టరేట్‌కు వెళ్తే నిరుత్సాహమే ఎదురవుతుందన్నారు. అక్కడ అర్జీలు తీసుకునే అధికారులు లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగులకు లిఫ్ట్ అనుకూలంగా లేదని, కనీసం వీల్ చైర్ పట్టదని వాపోయారు. ఎండలో ఉండలేక రెండో అంతస్తులో కలెక్టర్ వద్దకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మెట్ల స్థానంలో ర్యాంపులు ఏర్పాటు చెయ్యలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దాహం వేస్తే కనీసం తాగునీరు సౌకర్యం కల్పించలేదన్నారు. దివ్యాంగులకు ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ అనకాపల్లి గాంధీనగర్‌లో ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. అంతకుముందు బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సభ్యులు మంత్రి శ్రీనివాసరావు, ముక్కా గణేష్, కరణం శివ, గెంజి కనకరాజు, ఎం. వి. ఎన్. సత్యనారాయణ, బొట్ట సంతోష్, కాండ్రేగుల నూక అప్పారావు, చెట్టుపల్లి శ్రీనివాసరావు, దూళి శివ, పచ్చిపాల నర్సింగరావు, మొల్లి తాతారావు, ఎండపల్లి శ్రీనివాసరావు, ఈశ్వరరావు, త్రినాథ్, బండా సింగ్ పాల్గొన్నారు.


