నూకాంబిక అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
అనకాపల్లి : గవరపాలెం నూకాంబిక అమ్మవారి బాలాలయంలో అమ్మవారిని ఆదివారం భక్తులు పొటెత్తారు. నూకాంబిక అమ్మవారి నెల పండుగను రాష్ట్ర పండగగా గుర్తించడంతో భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారి నెల జాతర ఈనెల 27వ తేదీ వరకూ నిర్వహించడం జరుగుతుందని ఈవో వెంపలరాం రాంబాబు చెప్పారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవదాయశాఖ ఉద్యోగులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొంతమంది భక్తులు అమ్మవారి ఆలయం వద్ద చలువు పందిళ్ల వద్ద కుటుంబ సమేతంగా వంటలు చేసుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిధులు భక్తులకు మజ్జిగ, తాగునీరు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను(గొల్లబాబు), కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


