మూగజీవాలకు ఆసరా దక్కెన్
● 13 ఏళ్లుగా పక్షుల కోసం నీటి తొట్టెల అందజేత ● వేసవిలో మూగజీవుల దాహార్తి తీరుస్తున్న కెన్ ఫౌండేషన్ ● ఈ ఏడాది 500 వాటర్ బౌల్స్ పంపిణీ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: వేసవి వచ్చిందంటే చాలు.. గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతుంటాం. ఉష్ణతాపాన్ని తీర్చుకునేందుకు ఏదో రూపంలో శరీరానికి నీటిని అందిస్తుంటాం.. మరి మూగజీవాల పరిస్థితి ఏమిటి? చుక్క నీటికోసం మైళ్ల దూరం ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్ని పక్షి జాతులు అంతరించిపోవడానికి వేసవి కూడా ఒక కారణమని జీవశాస్త్ర అధ్యయనాల్లో తేలింది. అందుకే మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు నగరంలోని కెన్ ఫౌండేషన్ 13 ఏళ్లుగా కృషి చేస్తోంది. వేసవిలో నీటి తొట్టెలను ఉచితంగా పంపిణీ చేస్తూ.. ఎన్నో జీవాలకు ఊపిరిపోస్తోంది.
100 తొట్టెలతో ప్రారంభమై..
సేవే మార్గంగా.. విద్యార్థులు వలంటీర్లుగా ‘కెన్’ అధ్యక్షుడు పుల్లేటికుర్తి సంతోష్ 2012లో వాటర్ బౌల్ పేరుతో సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి ఏడాది ఫౌండేషన్ వలంటీర్లే నగరంలోని పలు చోట్ల 100 నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. ఆ నీటి తొట్టెల వద్దకు పక్షులు, మూగజీవాలు వచ్చి నీటిని తాగుతుండటం చూసి నగర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తామూ ఈ ప్రాజెక్టులో భాగస్వాములమవుతామని ముందుకొచ్చారు. పెందుర్తి, విశాలాక్షినగర్, కొత్తవలస, స్టీల్‌ప్లాంట్, అనకాపల్లి, డాల్ఫిన్ నోస్, శివారు ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు వచ్చి నీటి తొట్టెలను తీసుకెళ్లారు. మేడలపై, పెరట్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతో పిచ్చుకలు, రామ చిలుకలు, పావురాలు, కాకులతో పాటు ఉడతలు, ఆవులు, కుక్కలు కూడా ఈ నీటి తొట్టెల వద్దకు చేరుకుని తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. ఇదిలా ఉండగా సంస్థ చైర్‌పర్సన్ గీతానారాయణ్ నీటి తొట్టెలకయ్యే ఖర్చును భరిస్తూ అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 2017 వరకు 750 నీటి తొట్టెలు సరఫరా చేయగా.. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 3 వేల వరకు పంపిణీ చేశారు. ఈ ఏడాది 500 నీటి తొట్టెలను సిద్ధం చేసి, మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్‌లో ఆదివారం పంపిణీ ప్రారంభించారు. సీఎంఆర్ ఎండీ మావూరి వెంకటరమణ, గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ రవిశంకర్ నారాయణ్ చేతుల మీదుగా వీటిని ప్రజలకు అందజేశారు. ఇంకా ఎవరైనా పక్షి ప్రేమికులుంటే నీటి తొట్టెలను అందించేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు.
9885674949కి కాల్ చేయండి
కెన్ ఫౌండేషన్ తరపున ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. తొలుత వంద చోట్ల వీటిని ఏర్పాటు చేసి.. ఏటా కొనసాగించాలని భావించాం. ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములవుతామని ప్రజలు ముందుకు రావడంతో మా ప్రయత్నం విజయవంతమైంది. పిచ్చుకలు, రామచిలుకలు వచ్చి ఆహారం తిని.. ఈ తొట్టెల్లో నీళ్లు తాగుతూ సేద తీరుతున్నాయని వారంతా చెబుతుంటే సంతోషంగా ఉంటుంది. ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా నీటి తొట్టెలు అందిస్తాం. 98856 74949కు సంప్రదించి నీటి తొట్టెలు పొందవచ్చు.
– గీతానారాయణ్, కెన్ చైర్‌పర్సన్
మూగజీవాలకు ఆసరా దక్కెన్
మూగజీవాలకు ఆసరా దక్కెన్


