కమనీయం.. రమణీయం
కనుల పండువగా సీతారాముల కల్యాణం
సిగ్గులొలుకుతూ సీతమ్మ.. మందహాసంతో రామయ్య.. వారి వివాహ మహోత్సవం జగతికంతా వేడుక.. భక్తులకు కనుల పండువ.. అందుకే ఊరూరా జనమంతా పెళ్లి పెద్దలై సీతారాముల కల్యాణాన్ని జరిపించారు.. ప్రతి గ్రామంలో రామాలయాల్లో, బహిరంగ వేదికలపై ఈ ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. చూచు వారలకు చూడ ముచ్చటట.. పుణ్య పురుషులకు ధన్యభాగ్యమట.. అని పాడుకుంటూ అమ్మవారికి అయ్యవారికి పెళ్లి జరిపించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్న రామాలయంలో స్వామివారి కల్యాణాన్ని అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, శేషాచార్యులు ఘనంగా నిర్వహించారు. వేంపాడు రామాలయంలో ఈ వేడుకను ఘనంగా జరిపారు. మరో భద్రాచలంగా పేరుగాంచిన అరబుపాలెంలో సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు నాని, భార్గవాచార్యులు శాస్త్రోక్తంగా జరిపారు. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు వంటి తంతులను నిర్వహించారు. కె.కోటపాడు మండలం చిరికివానిపాలెం, బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెంలో రకరకాల పిండివంటలతో సీతమ్మకు సారె సమర్పించారు. ఇలా.. జిల్లాలోని ప్రతి పల్లె రామనామంతో ప్రతిధ్వనించింది. వివాహ వేడుక నిర్వహించి మురిసిపోయింది. కల్యాణ కాంతులతో వెలిగిపోతున్న సీతారాములను చూసి పరవశించింది.
– సాక్షి న్యూస్ నెట్‌వర్క్
కమనీయం.. రమణీయం
కమనీయం.. రమణీయం
కమనీయం.. రమణీయం
కమనీయం.. రమణీయం


