అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం
● వేడుకగా ఎదుర్కోలు ఉత్సవం
ఉపమాకలోని శివాలయంలో స్వామివారి కల్యాణం
నక్కపల్లి: పురాతన శివాలయం ఉపమాకలో ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక కల్యాణం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈనెల 8నుంచి 12వ తేదీ వరకు స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అంకురార్పణ చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు ఆలయంలో గణపతి పూజ, శుద్ధి పుణ్యాహవచనం కార్యక్రమాలు జరిగాయి. అంకురార్పణ అనంతరం స్వామివారిని సప్పరం వాహనంలోను, అమ్మవారిని పల్లకిలో ఉంచి నక్కపల్లి ఎదురు సన్నాహ మహోత్సవ కార్యక్రమానికి తీసుకు వచ్చారు. మైలవరభట్ల జోగారావు ఇంటి వద్ద ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహించారు. ఈ పెళ్లిమాటల తంతును ప్రముఖ వేదపండితురాలు, ప్రవచనకర్త డాక్టర్ వేదాల గాయత్రీదేవి వ్యాఖ్యానంలో జరిగింది. స్వామి, అమ్మవార్ల గుణగణాలను భక్తుల కళ్లకు కట్టినట్టు వివరించారు. పెళ్లి కుమారుడి తరపున నక్కపల్లికి చెందిన శింగంశెట్టి వారి కుటుంబీకులు, పెళ్లి కుమార్తె తరపున ఎం.వి.వి.ఎస్ మూర్తి(సహరా పంతులు) వారి కుటుంబ సభ్యులతో ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహించడం జరిగింది. అనంతరం శింగంశెట్టి కుటుంబీకులతో ప్రసాద వినియోగం జరిగింది. ఉపమాకలో స్వామివారి ఆలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్ద శివపార్వతుల కల్యాణం కొప్పిశెట్టి వెంకటేష్ దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. 9వ తేదీన కుంకుమ పూజ, 10వ తేదీన సదస్యం, 11న తోట ఉత్సవం, 12న పూర్ణాహుతి స్వామివారి పుష్ప యాగోత్సవం, పవళింపు సేవ జరుగుతాయని కార్యనిర్వాహణాధికారి మురళీకృష్ణ తెలిపారు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణం తిలకించేందుకు నక్కపల్లి, ఉపమాకల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ కల్యాణోత్సవంలో ఉపమాక దేవస్థానం అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్, శేషాచార్యులు, వి.మహేష్ ఆచార్యులు, పసర కొండ పండు ఆచార్యులు, ఉపమాక దేవస్థానం మాజీ చైర్మన్‌లు, కొప్పిశెట్టి కొండబా బు, బుజ్జి, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డి.వి. రామారావు, శ్రీపాద ప్రణవ్‌రామ్, శివాలయం మాజీ చైర్మన్ వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నాయకుడు కె.హరిబాబు పాల్గొన్నారు.


