కేబుల్ టీవీ కంట్రోల్ రూం దగ్ధం
మాకవరపాలెం : అగ్నిప్రమాదంలో కేబుల్ టీవీ కంట్రోల్ రూం దగ్ధమైంది. మండలంలోని శెట్టిపాలెం గ్రామానికి చెందిన గొర్లి వాసుదేవనాయుడుకు భీమబోయినపాలెం పంచాయతీ కార్యాలయం పక్కనే కేబుల్ టీవీ కంట్రోల్ రూం ఉంది. అయితే ఇది చెక్కలతో తయారు చేసినది కావడంతో సోమవారం అర్ధరాత్రి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో లోపల ఉన్న సుమారు రూ.4 లక్షల విలువ చేసే కేబుల్ టీవీ సామగ్రి పూర్తిగా కాలిబూడిదైంది. ఈ విషయమై ఈ కంట్రోల్ రూం ఆపరేటర్ లాలం ఏసుబాబు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్టు అనుమానం ఉందని, పోలీసులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.


