గంజాయిని తుదముట్టించేలా..
● అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలి ● ప్రజలు సమాచారం తెలిపేందుకు టోల్ ఫ్రీ నంబరు 1972 ● నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గంజాయి రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి ఆమె పోలీస్, సెబ్, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖ, అటవీ శాఖ, కోస్ట్ గార్డ్, మైరెన్, జీఆర్పీ, మత్స్య శాఖల అధికారులతో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులతో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. 1972 టోల్ ఫ్రీ నంబరుపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, సమాచారం అందించిన వారి వివరాలు ఎవరికీ తెలియవని భరోసా కల్పించాలన్నారు.
నాలుగు వారాల ప్రత్యేక ప్రణాళిక
ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ తాటిపర్తి, కోనాం, డౌనూరు, భీమవరం, శ్రీరాంపురాలలో శాశ్వత చెక్ పోస్ట్‌లు, 38 వాహన తనిఖీ పాయింట్లు ఏర్పాటు చేశామని, నిరంతర నిఘా, సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామన్నారు. పటిష్టమైన నిఘా, తనిఖీలతో జిల్లా మీదుగా గంజాయి రవాణా అరికట్టగలిగినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల నుండి వచ్చే రైళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గంజాయి నిరోధానికి రూపొందించిన నెల రోజుల ప్రత్యేక ప్రణాళిక ప్రకారం మొదటి వారంలో పోలీసు, ఆరోగ్య, సంక్షేమ శాఖల ద్వారా ప్రజల నుంచి గంజాయికి సంబంధించిన సమాచారం సేకరిస్తామని, సేకరించిన సమాచారాన్ని రెండో వారంలో కేటగిరీ వారీగా క్రోడీకరిస్తామని, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మూడో వారంలో గంజాయి కార్యకలాపాలపై ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి, హైరిస్క్ ప్రాంతాల్లో నిఘా పెంచుతామన్నారు. నాలుగో వారంలో కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి తీసుకున్న చర్యలపై సమీక్షించుకుంటామన్నారు. ఈ సందర్భంగా 1972 టోల్ ఫ్రీ నంబరుపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించే ప్రచార పోస్టరును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎం.దేవప్రసాద్, ఆర్డీవోలు వి.వి.రమణ, షేక్ ఆయిషా, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.రాజేశ్వరి, డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకుడు ఎస్.విజయకుమార్, జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహనరావు, జిల్లా ప్రజా రవాణా అఽధికారి కె.పద్మావతి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


