క్రిస్టల్ ఫార్మా కార్మికుడి మృతి
● యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని సిటు ఆరోపణ
అచ్యుతాపురం రూరల్: సెజ్‌లో గల క్రిస్టల్ ఫార్మా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వల స కార్మికుడు మంగురాం తపెయ్ (32) మృతి చెందినట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము ఆరోపించారు. ఈ నెల 1న మంగురాం కంపెనీలో విధులు నిర్వహిస్తుండగా అస్వస్థతతో కళ్లు తిరిగి పడిపోయాడని, స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా నామమాత్ర చికిత్స చేసి పంపించేశారన్నారు.
మంగురాంకి సరైన చికిత్స అందకపోవడంతో నాలుగైదు రోజుల అనంతరం మళ్లీ అస్వస్థతకు లోనయ్యాడని, విశాఖ కిమ్స్ ఆస్పత్రికి, అనంతరం కేజీహెచ్‌కి తరలించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. సోమవారం రాత్రి మంగురాం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు మల్టీ స్పెషాలిటీగా చెప్పుకునే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రులతో సంబంధాలు పెట్టుకొని ఇక్కడి వైద్యంతో సరిపెడుతున్నాయని, దాంతో కార్మికుల జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆరోపించారు.


