పరిహారం చెల్లించాకే పనులు
● రాజయ్యపేటలో ఏపీఐఐసీ అధికారులను అడ్డుకున్న మత్స్యకారులు
నక్కపల్లి: తమ డీ ఫారం భూముల్లో ఉన్న చెట్లకు, సాగులో ఉన్న ప్రభుత్వ భూములకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే రోడ్డు పనులు ప్రారంభించాలని పలువురు మత్స్యకారులు డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభించడాన్ని వారు అడ్డుకున్నారు. రాజయ్యపేటలో సర్వే నెంబరు 290లో ఉన్న సుమారు 70 ఎకరాల ప్రభుత్వ డీఫారం భూములను మత్స్యకారులకు పంపిణీ చేయడం, వారు అక్కడ జీడి, మామిడితోటలు పెంచుకుని సాగుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఏపీఐఐసీ వారు బల్క్‌డ్రగ్ పార్క్ కోసం ఈ భూములు సేకరించారు. కేవలం భూములకు మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. వాటిలో ఉన్న చెట్లకు పరిహారం చెల్లించకుండా కొద్దిరోజుల నుంచి ఏపీఐఐసీ వారు యంత్రాలతో చెట్లను తొలగించి రోడ్లు నిర్మిస్తున్నారంటూ మంగళవారం మత్స్యకారులు పనులు అడ్డుకున్నారు. ఏపీఐఐసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నక్కపల్లి, ఎస్.రాయవరం సీఐలు కుమారస్వామి, రామకృష్ణ తమ సిబ్బందితో చేరుకున్నారు. తహసీల్దార్ ఆర్.నర్సింహమూర్తి ఈ భూముల వద్దకు వచ్చారు. సీపీఎం నాయకులు అప్పలరాజు తదితరులు మత్స్యకారుల వద్దకు వెళ్లి వారికి అండగా నిలిచారు. మత్స్యకారులంతా యంత్రాల ముందు నిలబడి పనులు నిలుపుదల చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్, సీఐలు మత్స్యకారులతో చర్చలు జరిపారు. చెట్లకు పరిహారం విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, సాగులో ఉన్న రైతుల వివరాల నమోదు కోసం సర్వే చేస్తామని చెబుతూ.. అప్పటి వరకు ఈ వివాదాస్పద భూముల్లో పనులు తాత్కాలికంగా నిలిపివేయడానికి అధికారులు అంగీకరించారు.


