చేపలకు చికెన్ మేత!
దేవరాపల్లి : చెరువుల్లో చేపలకు మేతగా యధేచ్చగా చికెన్ వ్యర్థాలను తరలిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా చికెన్ దుకాణాల నుంచి సేకరించిన కోళ్ల వ్యర్ధాలతో కొందరూ మాఫియాగా ఏర్పడి దర్జాగా వ్యాపారం చేస్తూ కాసులు గడిస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి విశాఖతో పాటు పొరుగు జిల్లాలకు సైతం కోళ్ల వ్యర్థాలను తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఈ వ్యర్థాలను తినే చేపలను తింటే క్యాన్సర్ వస్తుందని వైద్యులు చెబుతున్నా మాఫియా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్లాస్టిక్ డ్రమ్‌ల్లో నింపి వాహనాల్లో తరలిస్తున్నారన్నారు. కోళ్ల వ్యర్థాలను తినడం వల్ల త్వరగా చేప బరువు పెగడంతో పాటు మేత ఖర్చు కూడా తగ్గుతుండడంతో చేపల చెరువుల నిర్వాహకులు వీటిపైనే మొగ్గు చూపుతున్నారన్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలో ఈ చికెన్ వ్యర్ధాల దందా బహిరంగంగా జరుగుతున్నా, పోలీసులు, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. కోళ్ల వ్యర్ధాలతో పెంచిన చేపలను తినడం వల్ల క్యాన్సర్ కాలేయ, జీర్ణకోశ, గ్యాస్ట్రిక్, మలబద్దకం, ఫైల్స్, చర్మ వ్యాధులు, ప్రేగుల్లో పుండ్లు తదితరరోగాలు వస్తాయని నిపుణులు చెబుతన్నారన్నారు. కోళ్ల వ్యర్థాలను నిల్వ చేయడం వల్ల పర్యావరణం కలుషితమవుతుందన్నారు. ఇప్పటికై నా అధికారులు మామ్మూళ్ల మత్తు వీడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కోళ్ల వ్యర్థాల మాఫియాను కట్టడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విచ్చలవిడిగా చికెన్ వ్యర్థాల వినియోగం
ప్రజారోగ్యంతో చెలగాటం
పట్టించుకోని పోలీసులు, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు
సీపీఎం నేత వెంకన్న ధ్వజం
చేపలకు చికెన్ మేత!
చేపలకు చికెన్ మేత!


