టీడీఆర్ బాండ్లు మాకొద్దు
● మాట నిలుపుకోండి.. పరిహారం జమ చేయండి ● ఆర్డీవోకు పూడిమడక రోడ్డు విస్తరణ బాధితుల స్పష్టీకరణ ● మునగపాకలో టీడీఆర్ బాండ్లపై అవగాహన సమావేశం
మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణలో భూములు, గృహాలు కోల్పోతున్న నిర్వాసితులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు పరిహారాన్ని నేరుగా అకౌంట్‌లో జమ చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ కోరారు. రహదారి విస్తరణ ప్రతి ఒక్కరికీ సమ్మతమేనని, అయితే గత గ్రామసభల్లో ఇచ్చిన హామీకి కట్టుబడాలన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ ఎస్.ఆదిమహేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో షేక్ ఆయిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ.. టీడీఆర్ బాండ్ల వలన తమకు ప్రయోజనం లేదని, ప్రభుత్వం నేరుగా పరిహారాన్ని అకౌంట్‌లో జమ చేయాల్సిందేనని పట్టుబట్టారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ పూడిమడక రోడ్డు విస్తరణకు సంబంధించి గత వైఎస్సార్‌సీపీ హయాంలోనే పరిహారం నిర్ణయించారని, అయితే పెరిగిన భూమి ధరలకు అనుగుణంగా పరిహారం పెంచుతారని నిర్వాసితులు ఆశించారన్నారు. అయితే రహదారి విస్తరణ జరిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆశతో గతంలో నిర్ణయించిన ధరకు అంగీకరించారన్నారు. పరిహారాన్ని టీడీఆర్ బాండ్ల రూపంలో ఇవ్వడం వలన ప్రయోజనం ఉండదన్నారు. ఇందుకు స్పందించిన ఆర్డీవో ఆయిషా మాట్లాడుతూ తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రహదారి విస్తరణ అవసరమన్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం టీడీఆర్ బాండ్లను పరిహారంగా ఇస్తుందని చెబుతూ.. ఈ బాండ్ల వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ, స్థానికులు దొడ్డి శ్రీనివాసరావు, టెక్కలి పరశురామ్, ఆడారి అచ్చియ్యనాయుడు, దాడి ముసిలినాయుడు, ఆడారి శ్రీకాంత్, వీఆర్వో సురేష్ తదితరులు పాల్గొన్నారు.


