
అడుగంటుతున్న పెద్దేరు
మాడుగుల: పెద్దేరు జలాశయానికి ఇన్‌ఫ్లో లేకపోవడంతో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 134 మీటర్లకు తగ్గిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి 135 మీటర్లు ఉంది. వర్షాలు అనుకూలించకపోతే ఖరీఫ్‌లో చెరకు, వరి, నువ్వు చేలకు ఇబ్బందిగా ఉంటుందని పెద్దేరు జలాశయం ఆయకట్టు రైతులు చెబుతున్నారు. జలాశయం ఖరీఫ్ ఆయకట్టు 15 వేల ఎకరాలు కాగా ప్రస్తుతం 10 వేల ఎకరాల్లో సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. పంట కాలువలకు మరమ్మతులు చేపడతామని రబీ వరి సాగుకు సాగునీరు విడుదల చేయలేదు. వ్యవసాయ మోటార్ల వద్ద అక్కడక్కడ రబీ వరి చేలు సాగు చేసుకున్నారు. కానీ పెద్దేరు జలాశయం పంట కాలువ మరమ్మతు పనులు నేటికీ ప్రారంభించకపోవడంతో రైతులు అసంతృప్తితో ఉన్నారు. సంబంధిత అధికారులు స్పందించి పంట కాలువ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.