మరో 30 ఎకరాల్లో సరుగుడు తోటల దగ్ధం
బుచ్చెయ్యపేట : చింతపాక గ్రామంలో మరో 30 ఎకరాల్లో సరుగుడు తోటలు కాలిపోయాయి. బుధవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన 80 మంది రైతులకు చెందిన 50 ఎకరాల సరుగుడు తోటలు కాలిపోగా సుమారు కోటిన్నర రూపాయలు రైతులకు ఆస్తి నష్టం జరిగింది. రావికమతం మండలం గొంప గ్రామానికి చెందిన రైతులకు చింతపాక రెవిన్యూలో భూములున్నాయి. అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలిసి గురువారం రైతులు తమ పొలాల్లోకి వెళ్లి చూడగా వీరి సరుగుడు తోటలు కూడా కాలిపోయినట్టు గుర్తించారు. గొంప గ్రామానికి చెందిన పసుపులేటి సంజయ్, నాగరాజు, నాయుడు, శ్రీను, పెంటారావు, సత్తిబాబు, నరసమ్మ, కన్నంనాయుడు, సతీష్ తదితర రైతులకు చెందిన 30 ఎకరాల్లో తోటలు కాలిపోయాయి. సుమారు రూ.90 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్టు బాధిత రైతులు వాపోతున్నారు. చింతపాక రెవిన్యూలో భూములండడంతో నష్టాన్ని గుర్తించి పరిహారం అందేలా అధికారులు చూడాలని బాధిత రైతులు కోరుతున్నారు.


