హత్య కేసులో నిందితుడి అరెస్ట్
నర్సీపట్నం : పట్టణంలోని అయ్యన్న కాలనీలోని జరిగిన హత్య కేసులో నిందితుడు చిత్రాడ మహేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. నిందితుడిని అయ్యన్న కాలనీ జంక్షన్ చింతపల్లి రోడ్డులో ట్రైనీ డీఎస్పీ చైతన్య, సీఐ గోవిందరావు అదుపులోకి తీసుకున్నారన్నారు. అయ్యన్నకాలనీలో ఈ నెల 8వ తేదీన తలుపులమ్మ తల్లి పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజ్ ప్రోగ్రాం వద్ద మృతుడు రుత్తల దుర్గాప్రసాద్‌తో నిందితుడు మహేష్ గొడవపడ్డాడని, అక్కడ విధి నిర్వహణలో ఉన్న తమ సిబ్బంది ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి పంపించేశారన్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో నిందితుడు మహేష్ మళ్లీ దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్లి గొడవపడ్డాడని, దుర్గాప్రసాద్ ఛాతిలో కత్తితో మూడుసార్లు పొడిచి చంపాడని తెలిపారు. మృతుడి స్పేహితుడు అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిని కూడా గాయపరిచాడన్నారు. ఈ ఘటనలో నిందితుడిపై 75/2025యు/ఎస్103(1)బీఎన్‌ఎస్ యాక్టు కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిపై టౌన్ స్టేషన్‌లో మరో కేసు ఉందని, అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేశామన్నారు. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.


