ఇరుకు గదుల్లో పనిచేయడం వల్లే ప్రమాద తీవ్రత
కోటవురట్ల: ఇరుకు గదుల్లో ఎక్కువ మంది మందుగుండు తయారు చేయడం వల్లనే ఇంత భారీ స్థాయిలో ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కై లాసపట్నంలోని విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్‌లో ఆదివారం జరిగిన ప్రమాద స్థలాన్ని డీజీ సోమవారం పరిశీలించారు. ఇక్కడకు దగ్గరలో ఓ చోట భద్రపరిచిన మందుగుండు సామగ్రిని గుర్తించి, వాటిని నీళ్లతో తడిపి పనిచేయకుండా నిర్వీర్యం అయ్యేలా చేశారు. అక్కడి నుంచి యండపల్లిలో ఉన్న మరో తయానీ కేంద్రాన్ని తనిఖీ చేసి పాత్రికేయులతో మాట్లాడారు. ప్రాథమికంగా జరిపిన పరిశీలనను బట్టి చిన్న ఇరుకు గదుల్లో ఎక్కువ మంది పనిచేయడం వల్లనే అధిక ఒత్తిడితో పేలుళ్లు సంభవించాయన్నారు. ఎక్కడైనా ఇటువంటి కేంద్రాలు విశాలమైన ప్రదేశాలలో సాధ్యమైనంత వరకు ఓపెన్ ప్లేస్‌లో విడివిడిగా పనిచేసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. యండపల్లిలోని ఫైర్ స్టేషన్‌ను మంచి వాతావరణంలో ఏర్పాటు చేశారన్నారు. విశాలమైన ప్రదేశం ఉండడంతో పాటు కార్మికులు ఎక్కువ మంది ఒకే చోట ఉండకుండా విడివిడిగా దూరంగా పనులు చేసేలా ఏర్పాడు చేశారన్నారు. ఇటువంటి చోట ప్రమాదం జరిగినా అంత తీవ్రత ఉండదన్నారు. మిగతా అన్ని మందుగుండు తయారీ కేంద్రాలను తనిఖీ చేసి సేఫ్టీ ప్రమాణాలను పరిశీలించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తయారు చేసిన మందుగుండును సాధ్యమైనంత వరకు అండర్‌గ్రౌండ్‌లో నిల్వ చేసేలా ఆలోచించాలన్నారు. ఇక్కడ ఎస్పీ తుహిన్ సిన్హా పరిశీలించి నిర్వాహకుడు రమణకు సూచనలు చేశారు. సేఫ్టీ అంశాలను పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


