ప్రైవేటు చేతికి మెడికల్‌ కాలేజీ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు చేతికి మెడికల్‌ కాలేజీ

Apr 27 2025 1:28 AM | Updated on Apr 27 2025 1:28 AM

ప్రైవేటు చేతికి మెడికల్‌ కాలేజీ

ప్రైవేటు చేతికి మెడికల్‌ కాలేజీ

● మంత్రి కంటే స్పీకరే బాగుంది.. చంద్రబాబు నా దగ్గరకు రావాలి ● బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై దాడులు చేయాలి ● కేజీబీవీ భవనాలకు స్పీకర్‌ అయ్యన్న శంకుస్థాపన

నాతవరం: మాకవరపాలెం మండలంలో నిర్మించే మెడికల్‌ కాలేజీకి ప్రభుత్వం నుంచి అనుమతులు లేవని, దానిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నామని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. మర్రిపాలెం గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో రూ.కోటి 60 లక్షలతో చేపట్టనున్న అదనపు భవన నిర్మాణానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో అనుమతులు లేకుండా మెడికల్‌ కాలేజీ భవనాలను గోడల వరకు నిర్మించారని, వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇటీవల ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లపైనే యువకులు గుంపులుగా మద్యం తాగుతున్నారని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి తీసుకునేవారిని అరెస్టు చేయాలని రూరల్‌ సీఐ రేవతమ్మను ఆదేశించారు. ప్రసవాల కోసం గర్భిణులను ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంత్రి కంటే స్పీకర్‌ పదవే బాగుందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు సైతం తన దగ్గరకే రావాలన్నారు. కేజీబీవీ ప్రిన్సిపల్‌ కె.భవాని, నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, మండల ప్రత్యేకాధికారి నాగ శిరీష, తహసీల్దార్‌ వేణుగోపాల్‌, వివిధ శాఖలు అధికారులు పాల్గొన్నారు.

వేములపూడిలో..

నర్సీపట్నం: వేములపూడి కేజీబీవీ జూనియర్‌ కళాశాల నూతన భవనాలకు స్పీకర్‌ సిహెచ్‌.అయ్యన్నపాత్రుడు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.164.02 లక్షలతో అదనపు భవనాలను నిర్మిస్తున్నామన్నారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిని 150 నుంచి 200కి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నానన్నారు. వేములపూడి పీహెచ్‌సీ స్థాయిని కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి బయపురెడ్డిపాలెం బ్రిడ్జి దగ్గర నుంచి కోటవురట్ల మండలం కొత్తూరు వరకు రూ.21 కోట్లతో పక్కా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రమణమ్మ, సర్పంచ్‌ నూకాలమ్మ, ఎంపీటీసీ బోళెం రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement