ఏయూ వారసత్వాన్నినిలబెడదాం | - | Sakshi
Sakshi News home page

ఏయూ వారసత్వాన్నినిలబెడదాం

Apr 27 2025 1:28 AM | Updated on Apr 27 2025 1:28 AM

ఏయూ వ

ఏయూ వారసత్వాన్నినిలబెడదాం

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె.మధుమూర్తి పిలుపు

ఏయూ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

విజన్‌ డాక్యుమెంట్‌, లోగోలు ఆవిష్కరించిన అతిథులు

ఉత్సవాల్లో భాగంగా బీచ్‌రోడ్డులో వాకథాన్‌

విశాఖ విద్య: ఘనమైన వారసత్వం కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం అభ్యున్నతికి అందరూ సమష్టిగా కృషి చేయాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య కె.మధుమూర్తి పిలుపునిచ్చారు. ఏయూ శతాబ్ది వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా బీచ్‌రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. శతాబ్ద కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేకమంది జీవితాలను ప్రభావితం చేసిందన్నారు. అదే విధంగా యువ మస్తిష్కాలను తీర్చిదిద్దిన ఘనత ఏయూ సొంతమని చెప్పారు. ఇది దేశ ప్రగతికి, ప్రపంచ ప్రగతికి దోహదపడిందన్నారు. తనకు ఇక్కడ చెప్పలేనన్ని అపురూప జ్ఞాపకాలు ఉన్నాయని, విద్యార్థిగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థులకు జ్ఞానంతో పాటు విలువలు ఎంతో అవసరమని చెప్పారు. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తినిచ్చేదిగా ఈ ప్రయాణం నిలుస్తుందని మధుమూర్తి అన్నారు. భవిష్యత్‌లో బోధన విధానాన్ని ఏఐ సాంకేతికత సవాలు చేసే దిశగా మారుతుందన్నారు. విద్య, పరిశోధన, ప్రజాసేవ రంగాల్లో ఏయూ తనదైన శైలిలో ముందుకు వెళ్లాలని సూచించారు. విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. విశిష్ట అతిథి ఐఐటీ పాలక్కాడ్‌ డైరెక్టర్‌ ఎ.శేషాద్రి శేఖర్‌ మాట్లాడుతూ సమగ్ర విద్యను అందించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు.

ప్రాథమిక సూత్రాలు, శాస్త్ర సంబంధ అంశాలపై బలమైన పట్టు సాధించడం ఎంతో అవసరమని, అదే విధంగా సాఫ్ట్‌ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా తాను ఈ స్థానంలో నిలవడానికి గల కారణం, సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ప్రతి విద్యార్థి జాతీయ విద్యా విధానం డాక్యుమెంట్‌ను చదవాలని సూచించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ, దార్శనికుల వారసత్వం, నాయకత్వం ఏయూను నడిపిస్తోందన్నారు. అకడమిక్‌, మౌలికసదుపాయాలు, ఔట్రీచ్‌ రంగాల్లో ఏయూ మరింత పటిష్టంగా పనిచేస్తుందన్నారు. ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ విభాగాలను మరింత బలోపేతం చేస్తామని వివరించారు. ఏడాది పొడుగునా నిర్వహించే శతాబ్ది వేడుకల్లో నోబెల్‌ గ్రహీతలను ఆహ్వానిస్తామని వీసీ చెప్పారు. విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ , పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్‌ కె.వి.వి.రావు, ఏయూ రెక్టార్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌ బాబు, రిజిస్ట్రార్‌ ఆచార్య ఇ.ఎన్‌ ధనుంజయరావు తదితరులు ప్రసంగించారు.

విశ్రాంత ఆచార్యులకు సన్మానం

ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు సి.హెచ్‌ శాంతమ్మ, ఆచార్య బి.ప్రసాద్‌ రావులను ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం ఆచార్య ప్రసాదరావు చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం విద్యార్థుల మనసులను హత్తుకుంది. తాము చదువుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ రుణం తీర్చుకోవాలని, విలువలతో కూడిన విద్యను అందించాలని ఉద్దేశంతో తాను స్థాపించిన పాఠశాల అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఏయూ విజన్‌ డాక్యుమెంట్‌, లోగోలను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమం ఆరంభంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు పూర్వ ఉపకులపతులు, విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఆచార్యులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు.

ఏయూ వారసత్వాన్నినిలబెడదాం 1
1/1

ఏయూ వారసత్వాన్నినిలబెడదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement