ఏలేరు కాలువలో పడి దివ్యాంగుడి మృతి
కశింకోట: తాళ్లపాలెం వద్ద ఏలేరు కాలువలో ప్రమాదవశాత్తూ జారిపడి దివ్యాంగ విద్యార్థి మృతి చెందాడు. సీఐ అల్లు స్వామినాయుడు తెలిపిన వివరాలివి. సబ్బవరం మండలం గుల్లెపల్లి గ్రామానికి చెందిన కొండ్రపు సాయి (14) తల్లి ఆదిలక్ష్మితో కలిసి తాళ్లపాలెంలో బంధువుల ఇంటికి ఈ నెల 23న వివాహానికి వెళ్లాడు. అక్కడ శుక్రవారం సమీపంలోని ఏలేరు కాలువకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన సాయి కాలుజారి ఏలేరు కాలువలో పడి గల్లంతయ్యాడు. సాయి కోసం బంధువులు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. శనివారం సమీపంలో కాలువలో మృతదేహం బయటపడింది. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్‌ఐ కె.రమణమ్మ కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన సాయి విశాఖలోని పెద్ద వాల్తేర్‌లోని శాంతి ఆశ్రమంలో 9వ తరగతి చదువుతున్నాడన్నారు. తల్లిదండ్రులు కూలీలని, మృతుడు రెండో కుమారుడన్నారు.
ఏలేరు కాలువలో పడి దివ్యాంగుడి మృతి


