122 కేజీల గంజాయి పట్టివేత
● ఐదుగురు అరెస్ట్
అనకాపల్లి టౌన్: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి విక్రయించే ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, రూ.6 లక్షలు విలువ చేసే 122 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం ముందుగా అందిన సమాచారం మేరకు సంపతిపురం జంక్షన్ వద్ద తనిఖీ చేస్తుండగా కూండ్రం వైపు నుంచి అనకాపల్లికి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిని అనుమానం వచ్చి పట్టుకున్నామన్నారు. వారి వెనుక ఒక ప్యాసింజర్ ఆటోలో గంజాయిని తీసుకొస్తున్న విషయం తెలిపారన్నారు.
ఆటో సీటు కింద మూడు బ్యాగులలో రెండు కిలోల చొప్పున 61 ప్యాకెట్లు లభ్యమయ్యాయని, దాంతోపాటు ఐదు సెల్‌ఫోన్లు, ఆటో, ద్విచక్ర వాహనం, వెయ్యి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆటోలో ప్యాసింజర్ల మాదిరిగా ఇద్దరు మగవారు, ఒక మహిళ వస్తున్నారని, ఒడిశా రాష్ట్రానికి చెందిన నిందితుడు ప్రశాంత్ బారిక్ గతంలో చాలా నేరాల్లో అరెస్టయి, శిక్ష అనుభవించాడన్నారు.
అతనితోపాటు సుకాంత్ గౌడ్, సుబర్ణ హరిజన్, బాసుకిలో, బతన్ హరిజన్‌లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందుతులను పట్టుకున్న రూరల్ సిఐ అశోక్‌కుమర్, జి.రవికుమార్, ఎస్‌ఐ మల్లికార్జునరావు పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించి ప్రశంసా పత్రాలను అందిచారు. సమావేశంలో డిఎస్పీ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.


