అనకాపల్లి : స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర వేడుకలను ఈనెల 17 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకూ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. స్థానిక అమ్మవారి ఆలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సోమవారం జాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది అమ్మవారి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించడం జరిగిందన్నారు. అమ్మవారి జాతర, కొత్త అమావాస్య, ఉగాది మహోత్సవాలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీ, వీవీఐపీల దర్శనాల కోసం ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, క్యూలైన్ల ఏర్పాటు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. క్యూలైన్‌లో ఉండే భక్తులకు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, చిన్నపిల్లలకు పాలు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, వాహనాలకు పార్కింగ్ సదుపాయం, భక్తులకు సరిపడా క్యూలైన్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్య చర్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. జాతరకు విశాఖ, అనకాపల్లి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 18 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత, ఆలయ ఈవో శ్రీధర్, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, పోలీస్, జీవీఎంసీ, ఫైర్ సర్వీస్, విద్యుత్ శాఖ, డీఎంఅండ్‌హెచ్‌ఓ, విభాగాల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


